CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగానే వస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉండడం, నియోజకవర్గంలో వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, బీసీ నేతకు టికెట్ ఇవ్వడం, ఇలా అన్నీ కలిసి వచ్చి ప్రజలు హస్తం వైపు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇక, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రంగంలోకి దిగి ప్రచారంలో పాల్గొన్నాక తిరుగు లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి సమయంలో పార్టీ నేతలు, ఇన్‌ఛార్జ్ మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. సర్వేలు అనుకూలంగానే ఉన్నా నిర్లక్ష్యం వద్దని, నవీన్ యాదవ్ మెజార్టీపై మరింత దృష్టి పెట్టాలని అన్నారు.
గెలుపు కోసం ప్రత్యేక ప్రణాళిక
కంటోన్మెంట్ తరహాలోనే జూబ్లీహిల్స్‌నూ దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. దీనికోసం అన్ని పార్టీల కంటే ముందు ఉన్నది. ప్రచారంలో దూసుకెళ్తున్నది. ప్రచారంలో ఇంకా వేగం పెంచాలని, ఉన్న కొద్ది రోజుల్లో జనంలోనే ఉండాలని పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సమవేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరావు, అజారుద్దీన్, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
కొత్త కార్యక్రమాలతో జనంలోకి
ఉప ఎన్నిక ప్రచారంలో కొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ లెవెల్‌లో ప్రతీ ఓటరును నేరుగా కలిసేలా ప్లాన్ చేయాలని మంత్రులను ఆదేశించారు. పోలిగ్ బూత్ లెవెల్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్లతో నియోజకవర్గ సమస్యలను వీడియోలుగా రూపొందించాలని చెప్పారు. బూత్ స్థాయిలో కీలకమైన వారి ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రచారం వేగాన్ని పెంచి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీని పెంచే అంశంపై మరింత దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశనం చేశారు.
Also Read: CM Revanth Reddy: నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు
