IND-W vs AUS-W Records: ఐసీసీ మహిళల వన్డే కప్ లో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. సెమీస్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రికార్డ్ లక్ష్యాన్ని ఛేదించి.. యావత్ భారతాన్ని ఆనందంలో ముంచెత్తింది. ముంబయిలోని డి.వై. పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో జరిగిన సెమీస్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఏకంగా 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. 339 టార్గెట్ తో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 48.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని (341/5) ఛేదించి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఆల్ రౌండర్ జెమిమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ (127*) తో జట్టును విజయతీరాలకు చేర్చింది. అయితే ఈ భారీ ఛేజింగ్ మ్యాచ్ లో పలు ప్రపంచ రికార్డులు బద్దలు అయ్యాయి.
మ్యాచ్ ఎలా సాగిందంటే?
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. ఫీబ్ లిచ్‌ఫీల్డ్ (119 పరుగులు) అద్భుత శతకం, ఎల్లీస్ పెర్రీ (77), యాష్ గార్డ్‌నర్ (63) మెరుపు అర్ధశతకాలతో నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ప్రపంచకప్ నాకౌట్‌లో ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమని భావించినప్పటికీ, భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఛేజింగ్‌లో ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన (24) త్వరగా పెవిలియన్ చేరినా, క్రీజులోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ చెక్కు చెదరని పోరాటాన్ని ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89 బంతుల్లో 88)తో కలిసి జెమిమా మూడో వికెట్‌కు ఏకంగా 167 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
జెమిమా దూకుడు..
హర్మన్‌ప్రీత్ ఔటైన తర్వాత కూడా జెమిమా తన దూకుడును కొనసాగించి, ఒత్తిడిలో తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను ఆడింది. ఆమె 134 బంతుల్లో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ సెంచరీతో మహిళల ప్రపంచకప్ నాకౌట్లలో శతకం సాధించిన రెండో భారత క్రికెటర్‌గా ఆమె నిలిచింది. చివరి ఓవర్లలో రిచా ఘోష్ (16 బంతుల్లో 26) అందించిన మెరుపు సహకారంతో భారత్ 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు గత 2017 ప్రపంచకప్ సెమీఫైనల్ నుంచి కొనసాగిస్తున్న అజేయ పరంపరకు భారత్ బ్రేక్ వేసింది. ఇక ఆదివారం జరగబోయే ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. వన్డేల్లో విశ్వవిజేతగా నిలవనుంది.
బద్దలైన రికార్డులు..
అత్యధిక రన్ ఛేజ్
వరల్డ్ కప్ నాకౌట్ దశలో అత్యధిక సక్సెస్ ఫుల్ రన్ ఛేజ్ మ్యాచ్ గా భారత్ – ఆసీస్ సెమీస్ పోరు నిలిచింది. అటు పురుషుల క్రికెట్ ను పరిగణలోకి తీసుకున్నా ఇదే అత్యధిక రన్ ఛేజ్ మ్యాచ్ కావడం గమనార్హం.
అత్యధిక పరుగులు
సెమీస్ లో భారత్ – ఆసీస్ రెండు జట్లు కలిపి 679 పరుగులు చేశాయి. మహిళల వన్డే చరిత్రలో ఇది అత్యధిక పరుగులు వచ్చిన రెండో మ్యాచ్. అయితే ఆశ్చర్యకరంగా ఫస్ట్ ప్లేస్ లోనూ ఈ రెండు జట్లే నిలిచాయి. ఈ ఏడాది దిల్లీ వేదికగా జరిగిన భారత్ – ఆసీస్ వన్డేలో 781 పరుగులు నమోదు కావడం గమనార్హం.
ఆసీస్ జైత్రయాత్రకు చెక్
మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేస్తున్న జైత్రయాత్రకు నిన్నటి సెమీస్ మ్యాచ్ తో టీమిండియా చెక్ పెట్టింది. ఆస్ట్రేలియా జట్టు వరుసగా 15 వరల్డ్ కప్ మ్యాచుల్లో విజయం సాధిస్తూ వచ్చింది. అయితే సెమీస్ లో ఓడించడం ద్వారా ఆసీస్ కు టీమిండియా గట్టి షాకిచ్చింది. కాగా ఈ వరల్డ్ కప్ గ్రూప్ దశలోనూ ఆసీస్ ఒక్క మ్యాచ్ లోనూ ఓడిపోకపోవడం గమనార్హం.
అత్యధిక వ్యక్తిగత స్కోరు
సెమీస్ లో జెమిమా రోడ్రిగ్స్ 127 పరుగులతో విరోచిత ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. వన్డేల్లో ఆస్ట్రేలియాపై రన్ ఛేజింగ్ లో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం.
Also Read: Tummala Nageswara Rao: భారీ వర్షాలకు ఈ జిల్లాలోనే ఎక్కువ పంట నష్టం.. అధికారుల ప్రాథమిక అంచనా
రెండో అత్యధిక స్కోరు
సెమీస్ లో భారత్ చేసిన 341 పరుగులు.. మహిళల వరల్డ్ కప్ నాకౌట్ దశలో రెండో అత్యధిక స్కోరుగా నిలిచింది. అటు ఆస్ట్రేలియాపై ఇది నాల్గో అత్యధిక స్కోరు కావడం విశేషం.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				