Tummala Nageswara Rao: మొంథా తుపాను రైతులను నిండా ముంచింది. భారీ వర్షాలకు వరి(Pady), పత్తి(Cotan), మొక్కజొన్న, మిర్చి(Chilli), వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రభుత్వానికి నష్ట నివేదికను అందజేశారు. పూర్తి స్థాయిలో సర్వే చేస్తే పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. వరంగల్(Warangal), సూర్యాపేట(Suryapet), ఖమ్మం(Khammam), హనుమకొండ(Hanumakonda), నల్లగొండ(Nalgonda) జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది.
వరి పంట నష్టం
రాష్ట్రంలో తుపాను కారణంగా 2,82,379 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 70,700 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలోని 16 మండలాల్లో 48,444 ఎకరాలు, ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో 36,893 ఎకరాలు, హనుమకొండ జిల్లాలోని 14 మండలాల్లో 33,348 ఎకరాలు, నల్లగొండ జిల్లాలోని 22 మండలాల్లో 28,055 ఎకరాలు, నాగర్ కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లో 10,585 ఎకరాలు, మహబూబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 16,617 ఎకరాలు, జనగామ జిల్లాలోని 12 మండలాల్లో 18,320 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలోని 15 మండలాల్లో 15,987 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలోని 10 మండలాల్లో 1,583 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 8 మండలాల్లో 1,178 ఎకరాలు, మహబూబ్ నగర్ జిల్లాలోని 10 మండలాల్లో 668 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
ఇతర పంటల నష్టం
రాష్ట్ర వ్యాప్తంగా పత్తి 1,51,707 ఎకరాల్లో నష్టం జరుగగా, వరంగల్ జిల్లాలో 55 వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 23,911 ఎకరాలు, ఖమ్మంలో 22,574 ఎకరాలు, నాగర్ కర్నూల్ జిల్లాలో 18,647 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మొక్క జొన్న 4,963 ఎకరాలు, మిర్చి 3,613 ఎకరాలు, పప్పు ధాన్యాల పంట 1,228 ఎకరాలు, వేరుశనగ 2,674, ఇతర హార్టికల్చర్ పంటలు 1,300 ఎకరాల్లో నష్టం జరిగింది. పంట నష్టం ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగింది. అక్కడ 1,30,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా తర్వాతి స్థానంలో ఖమ్మం జిల్లా(62,400 ఎకరాలు) ఉన్నది. సూర్యాపేట జిల్లాలో 56,330 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక నివేదికలో తెలిపారు.
నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం
మొoథా తుపాను ప్రభావంతో నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత జిల్లాల్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని తెలిపారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ఎకరాకు ఎంత పంట నష్ట పరిహారం ఇవ్వాలో సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Also Read: Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				