Mahabubabad Cyclone Montha: మహబూబాబాద్ జిల్లాలో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ రైల్వే స్టేషన్ లోని పట్టాల మీదికి ఫీటు వరద నీరు చేరిపోయింది. దీంతో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్ లోనే నిలిచిపోయింది. అదేవిధంగా డోర్నకల్ సమీప రైల్వే స్టేషన్ గుండ్రాతిమడుగులో కోణార్క్ ఎక్స్ప్రెస్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం 1 లో కృష్ణ ఎక్స్ప్రెస్, ఖమ్మం జిల్లా పరిధిలో వందే భారత్ రైలు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు.
Also Read: Mahabubabad Heavy Rains: మహబూబాబాద్ జిల్లాలో.. 43 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
రైళ్లలో ఆగిపోయిన ప్రయాణికులకు చేయూత
మహబూబాబాద్ లో కృష్ణ ఎక్స్ప్రెస్, గుండ్రాతి మడుగు లో కోణార్క్ ఎక్స్ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికుల పరిస్థితి చూసిన మహబూబాబాద్ పోలీసులు స్పందించి వారికి ఆహార పదార్థాలు, మంచినీరు, చిన్నపిల్లలకి కావలసిన పాలు, బిస్కెట్స్, స్నాక్స్ అందించేందుకు కృషి చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని మొబైల్ షాప్ నిర్వాహకులు, కిరాణా షాపు, వర్తక సంఘం వ్యాపారులు స్పందించి రైళ్లలో ఆగిపోయిన ప్రయాణికులకు ఆహారం, స్నాక్స్, బిస్కెట్స్, పండ్లు, పాలు అందించి తమ ఉదారతను చాటుకున్నారు. గత ఏడాది కూడా రైళ్లు ఆగిపోయి ఇబ్బందులు పడిన సమయంలో కూడా అటు పోలీసులు ఇటు వర్తక సంఘ, మొబైల్ షాపుల వ్యాపారులు ప్రయాణికులకు ఆపన్న హస్తం అందించారు.
రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన గోల్కొండ ఎక్స్ప్రెస్ రైల్లోని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ రంగంలోకి దిగారు. తిను పదార్థాల సహాయక చర్యలను చేపట్టారు. ప్రయాణికులకు పులిహోర ప్యాకెట్లను అందించి వారి ఆకలి తీర్చేందుకు సహాయపడ్డారు. పోలీసులంటేనే ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తారని మరోసారి జిల్లా పోలీసులు నిరూపించుకున్నారు. రైతులు యూరియా బస్తాల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో కూడా జిల్లా పోలీసులే ముందుండి వారి ఇబ్బందులను తొలగించేలా యూరియా బస్తాలను అందించేందుకు కృషి చేశారు. గత ఏడాది కూడా రహదారులపై విస్తృతంగా వరదలు పాడుతున్న సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సహాయం లో పాల్గొన్న రూరల్ సీఐ సర్వయ్య మరోమారు మహబూబాబాద్ పట్టణంలో ఆగిపోయిన కృష్ణ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు తన వంతు ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్, తినుబండరాలను అందించి తన కర్తవ్యాన్ని నిరూపించుకున్నారు.
నాలుగు జిల్లాల్లో 13 చోట్ల అత్యధిక వర్షపాతం
రాష్ట్రంలో అత్యధికంగా 30 ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైతే కేవలం మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని 13 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ నాలుగు జిల్లాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో ప్రజలంతా అల్లకల్లోలం అవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో 126.5, కురవి మండలంలోని అయ్యగారి పల్లి లో 105.3, మహబూబాబాద్ మండలంలోని ఆమనగల్ 100.5, ఇనుగుర్తి మండలంలో 88.0, డోర్నకల్ మండలంలోని తిరుమల సంకీస 85.0, మహబూబాబాద్ మండలంలోని మల్యాల అగ్రికల్చర్ రెసిడెన్షియల్ లో 81.5, సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి 103.5, ఖమ్మం తిరుమలయపాలెం 91.8, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు లో 90.8, నాగారం మండలం ఫణిగిరి 87.5, సూర్యాపేట మండలం లో 84.0, తిరుమలగిరి లో 82. 3, నల్గొండ జిల్లాలో శాలి గౌరారం లో 100.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Also Read: Heavy Rains: కుండపోత వర్షంతో కనిపించని రహదారులు.. ఎక్కడంటే..?
