Australia Cricketers: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ ప్రపంచ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కోసం ఇండోర్‌లోని బస చేసిన ఆసీస్ మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు ప్లేయర్లకు ఊహించని చేదు అనుభవం (Australia Women Cricketers) ఎదురైంది. ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లపై ఓ ఆకతాయి వేధింపులకు పాల్పడ్డాడు. ఒకర్ని అసభ్యకరంగా తాకాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. క్రికెటర్లు బస చేసిన హోటల్ రాడిసన్ బ్లూ నుంచి సమీపంలోనే ఉన్న ‘ది నైబర్‌హుడ్ కేఫ్’కు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లను కొద్దిసేపు వెనుక నుంచి బైక్‌పై అనుసరించిన ఆ ఆకతాయి, అసభ్యకరంగా తాకిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో, ఆ ఇద్దరు ఆసీస్ మహిళా క్రికెటర్లు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తమ టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ డానీ సిమన్స్‌కు అత్యవసర మెసేజ్ పంపించారు. తమ లైవ్ లొకేషన్ కూడా పంపించారు. తాను మెసేజ్ చదువుతుండగానే, ఇద్దరిలో ఒకరు తనకు కాల్ చేశారని, ఏం జరిగిందో చెప్పి ఏడ్చారని సిమన్స్ వెల్లడించారు. వెంటనే ఒక కారుని పంపి, అక్కడి నుంచి వారిద్దరిని సురక్షితంగా హోటల్‌కు చేర్చామని తెలిపారు.
సిమన్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా క్రికెటర్లను వేధించిన సమయంలో ఓ ప్రత్యక్ష సాక్షి.. నిందిత వ్యక్తి బైక్ నంబర్‌ను నోట్ చేసుకున్నాడు. దర్యాప్తు ఇది బాగా సాయపడింది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. నిందితుడి పేరు అక్వీల్ అని వెల్లడించారు. ఇండోర్‌లో భద్రత, ఆతిథ్యానికి సంబంధించిన అంశం కావడంతో పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో అసాధారణ వేగాన్ని ప్రదర్శించారు. విజయ్ నగర్, ఎంఐజీ, ఖజ్రానా, పర్దేశిపుర, కనాడియా అనే ఐదు పోలీస్ స్టేషన్లను అపరేషన్‌లోకి దించి నిందితుడి కోసం నిమిషాల వ్యవధిలోనే జల్లెడ పట్టారు. మొత్తానికి 6 గంటల్లోనే ఖజ్రానా నివాసిగా గుర్తించి అక్వీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్వీల్‌కు గతంలో కూడా క్రిమినల్ రికార్డు ఉంది.
Read Also- Cyclone Montha: మొంథా తుపానుపై బిగ్ అప్‌డేట్.. తీరం దాటేది ఎక్కడంటే?.. ఆ జిల్లాల్లో కుంభవృష్టే!
నిందితుడు అక్వీల్‌ను అరెస్టును క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ డీసీపీ రాజేష్ దండోటియా ధృవీకరించారు. ఆస్ట్రేలియా టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి అందిన ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి, కొన్ని గంటల్లోనే అరెస్టు చేశామని మీడియాకు తెలిపారు. నిందితుడికి నేరచరిత్ర ఉందన్నారు. ఇక, ఆటగాళ్ల విషయంలో భద్రత విషయంలో నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.
బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా స్పందన
ఈ షాకింగ్ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ అయింది. తమ జట్టులోని ఇద్దరు ప్లేయర్లను బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి అనుచితంగా తాకాడని ధ్రువీకరించింది. ఈ విషయాన్ని వెంటనే జట్టు భద్రతా సిబ్బంది ద్వారా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారని పేర్కొంది. ఈ ఘటనపై బీసీసీఐ కూడా స్పందించింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందిస్తూ, ఇది దురదృష్టకరమైన ఘటన అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. భారతదేశం ఆతిథ్యానికి, ఆప్యాయతకు ప్రసిద్ధి చెందిందన్నారు. ఇలాంటి ఘటనలను ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. నేరస్తుడిని త్వరగానే పట్టుకున్న మధ్యప్రదేశ్ పోలీసులను ఆయన అభినందించారు. ఆటగాళ్లకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, అవసరమైతే భద్రతా నిబంధనలను సమీక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
