WhatsApp Fraud: పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలు ఎంత అవగాహన కల్పిస్తున్నా దేశంలో సైబర్ నేరాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. ఎక్కువమంది వినియోగించే వాట్సప్ (WhatsApp Fraud) ప్లాట్‌ఫామ్ ద్వారా అమాయకులను బురిడీ కొట్టించేందుకు కేటగాళ్లు లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. ఇందుకోసం సమాజంలో బాగా తెలిసిన వ్యక్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల మాదిరిగా నమ్మించి బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక సూచన చేశారు. తన ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకొని మోసాలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటివాటిని నమ్మవొద్దని అప్రమత్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వాట్సప్‌లో డీపీగా తన ఫోటోను పెట్టుకుని, తెలిసిన వాళ్లకు మెసేజులు పంపిస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని సజ్జనార్ వెల్లడించారు.
ఇలాంటివి ఫేక్ ఖాతాలు అని, పూర్తిగా మోసపూరితమైనవని ఆయన తెలిపారు. ఇలాంటి మెసేజులకు స్పందించవొద్దని, ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సజ్జనార్ సూచించారు. సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలను అసలు ఇవ్వొద్దని ఆయన పేర్కొన్నారు. డబ్బులు అడిగితే పంపించొద్దని చెప్పారు. ‘‘సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్ట అనే విషయాన్ని మరచిపోవద్దు. ఫేక్ వాట్సప్ అకౌంట్లు మీ దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసిన సమాచారం అందివ్వండి. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ( http://cybercrime.gov.in) కూడా ఫిర్యాదు చేయండి’’ అంటూ వాట్సప్ వినియోగదారులకు సజ్జనార్ సూచించారు.
వాట్సప్ టార్గెట్‌గా మోసాలు
ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో కూడా కోట్లాది మంది వాడుతున్నారు. దీంతో, జాబ్ ఆఫర్, లాటరీ గెలుచుకున్నారు అంటూ మెసేజులు పంపిస్తూ జనాల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. విదేశీ నంబర్ల నుంచి ఈ తరహా మెసేజులు పంపిస్తున్నారు. ఆ విధంగా వీడియో కాల్స్ ద్వారా అమాయక ప్రజలను టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. పొరపాటు స్పందించి, వారు అడిగిన వివరాలు ఇస్తే వ్యక్తిగత సమాచారం దొంగిలించి, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అయితే, కొన్నిసార్లు సైబర్ నేరాలపై సరైన అవగాహన లేని అమాయకులతో పాటు చదువుకున్న వారు కూడా మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఈ నేరాల బారి నుంచి తప్పించుకోవాలంటే, అపరిచిత కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందించకుండా ఉండటం మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత వివరాలకు సంబంధించి రెండు దశల (టూ-స్టెప్) వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని అంటున్నారు.
జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు
వాట్సాప్ లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది.
ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి.
ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి.
సైబర్ నేరగాళ్లకు మీ… pic.twitter.com/AuvB7XzLXr
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 25, 2025
