Cyclone Montha: ఆంధ్రప్రదేశ్‌ను భయాందోళనలకు గురిచేస్తున్న మొంథా తుపానుకు (Cyclone Montha) సంబంధించి భారత వాతావరణ విభాగం కీలకమైన అప్‌డేట్స్ ఇచ్చింది. ఈ తీవ్ర తుపాను ఈ నెల 28న (మంగళవారం) కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వెల్లడించింది. ఈ తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అప్రమత్తం చేసింది. దక్షిణ కోస్తా జిల్లాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుపాను ప్రభావంతో 27, 28 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఈ నెల 27న బాపట్ల, ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇక, నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, తీరప్రాంత వాసులు సురక్షితంగా ఉండాలని సూచించింది.
Read Also- India VS Australia: రోహిత్, కోహ్లీ సెన్సేషనల్ బ్యాటింగ్.. ఆసీస్‌పై భారత్ చారిత్రాత్మక విజయం
ఉత్తరాంధ్రపై కూడా ఎఫెక్ట్
మొంథా తుపాను క్రమంగా తీరం వైపు కదులుతోందని ‘వైజాగ్ వెథర్‌మ్యాన్’ (ట్విటర్ పేజీ) తెలిపింది. కాకినాడకు సమీపంగా వైజాగ్, కృష్ణా జిల్లా మధ్య ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. తీవ్రమైన వర్షాలు, బలమైన ఈదురు గాలులు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలపై 27, 28, 29 తేదీల్లో ప్రభావం చూపిస్తుందని వెల్లడించింది.
ప్రస్తుతం కదలిక ఎలా ఉందంటే?
ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండంగా (Depression) ఇది కదలాడుతోంది. గత 3 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమం దిశగా పయనిస్తోందని భారత వాతావరణ విభాగం మరో ట్వీట్‌లో పేర్కొంది. శనివారం ఉదయం 8.30 గంటల (అక్టోబర్ 25) సమయానికి పోర్ట్ బ్లెయిర్‌కు (అండమాన్ అండ్ నికోబార్ దీవులు) పశ్చిమ-నైరుతి దిశలో సుమారు 440 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. విశాఖపట్నానికీ ఆగ్నేయ దిశలో సుమారు 970 కి.మీ దూరంలో, చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశలో సుమారు 970 కి.మీ దూరంలో, కాకినాడకు ఆగ్నేయ దిశలో సుమారు 990 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించింది. ఈ వాయుగుండం దాదాపుగా పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతోందని, అక్టోబర్ 26 నాటికి తీవ్ర వాయుగుండంగా (Deep Depression) మారే అవకాశం ఉందని వివరించింది. అనంతరం, అక్టోబర్ 27వ తేదీ ఉదయానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై తుఫానుగా (Cyclonic Storm) మార్పు చెందుతుందని తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశలో, అనంతరం ఉత్తర-వాయువ్య దిశలో కదులుతూ అక్టోబర్ 28 ఉదయానికి తీవ్ర తుఫానుగా (Severe Cyclonic Storm) బలపడుతుందని వివరించింది. అక్టోబర్ 28న సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో, మచిలీపట్నం – కలింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుందని వివరించింది.
