Bharat Taxi: మెట్రో నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి సిటీల్లో జన రవాణా నిర్వహణలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రైడింగ్ సర్వీసు సంస్థలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఇవన్నీ ప్రైవేటు కంపెనీలకు సంబంధించినవే కావడంతో రైడింగ్ ఛార్జీలు, డ్రైవర్ల సంక్షేమం, వినియోగదారుల భద్రత, డేటా గోప్యత, సేవల నాణ్యత విషయంలో ఆశించిన స్థాయిలో నియంత్రణ లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) అనే సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన యాప్‌ను ఆవిష్కరించింది. పైలెట్ ప్రాజెక్టుగా తొలుత దేశరాజధాని న్యూఢిల్లీలో దీనిని పరిశీలిస్తారు. ‘సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’ నేతృత్వంలో దీనిని నడిపిస్తారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది ఢిల్లీలో మొత్తం 5000 మంది డ్రైవర్లను రిజిస్టర్ చేయనున్నారు. ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని మార్పులు చేస్తారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా ఏకంగా లక్ష డ్రైవర్లకు భారత్ ట్యాక్సీని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రణాళిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రైవేటు కంపెనీలకు ఎందుకు భిన్నం?
ప్రస్తుతం ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేటు కంపెనీలు సేవలు అందిస్తుండగా, వాటితో పోల్చితే భారత్ టాక్సీ చాలా విభిన్నమైన విధానంలో నడుస్తుంది. ‘సహకార నమూనా’పై (Cooperative Model) పనిచేస్తుంది. అంటే, డ్రైవర్లు ప్యాసింజర్ల వద్ద తీసుకునే ఛార్జీల ఆదాయంలో 100 శాతం వారే పొందుతారు. ప్రైవేటు కంపెలకు ఇచ్చినట్టుగా కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయితే, కమీషన్‌కు బదులు కేవలం నామమాత్రపు మెంబర్‌షిప్ ఫీజును మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం డ్రైవర్లకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ‘భారత్ ట్యాక్సీ’కి ఇఫ్కో, నాబార్డ్, ఎన్‌సీడీసీ వంటి ప్రముఖ సహకార, ఆర్థిక సంస్థల సహకారం అందించనున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా భారత్ టాక్సీ యాప్‌ను డిజీలాకర్, ఉమాంగ్, ఏపీఐ సేతులతో అనుసంధానిస్తారు. తద్వారా సురక్షితమైన, పారదర్శకమైన, నిరంతరాయ సేవలను పొందవచ్చు. మొత్తంగా రవాణాను డిజిటల్‌తో అనుసంధానించడం ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది.
మరిన్ని ప్రయోజనాలు ఇవే
భారత్ ట్యాక్సీ ప్రైవేట్ సంస్థలతో పోటీ పడడం ఖాయం కావొచ్చు. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలకు కమీషన్లు చెల్లించాల్సి వస్తోంది కాబట్టి, ఆ ప్రభావం ఛార్జీలపై కూడా పడుతోంది. భారత్ ట్యాక్సీలో కమీషన్ల సమస్య ఉండదు. కాబట్టి, రవాణా ఛార్జీలు కూడా కొంతమేర తగ్గి ప్యాసింజర్లకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాదు, ఈ తరహా సేవలు ప్రస్తుతం ప్రధాన నగరాలకే పరిమితమై ఉన్నాయి. భారత్ ట్యాక్సీ సేవలు క్రమంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక, ప్రయాణికుల డేటా చాలా భద్రంగా ఉంటుంది. డేటా మొత్తాన్ని దేశీయంగా స్టోర్ చేస్తారు కాబట్టి, లీక్ అవుతుందనే భయం అక్కర్లేదు.
ఇక యాప్‌లో ఫీచర్లు ఏవిధంగా ఉంటాయో ఇప్పటివరకు వెల్లడి కాలేదు. కానీ, యూపీఐ, భారత్ క్యూఆర్ (BharatQR), ఇతర స్థానిక చెల్లింపు వ్యవస్థలతో పాటు వినియోగదారులు ఉపయోగించడానికి సులువుగా ఉండేలా ఈ యాప్‌ను రూపొందించనున్నాయి. ప్రయాణికుల సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా డ్రైవర్ వెరిఫికేషన్, రియల్-టైమ్ ట్రాకింగ్‌తో పాటు మరిన్ని మెరుగైన ఫీచర్లు అందించనున్నారు.
Read Also- Kishan Reddy: దేశంలో వందకు పైగా యూనికార్న్ స్టార్టప్‌లు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఓలా, ఉబర్, ర్యాపిడోలపై ప్రభావం!
భారత్ టాక్సీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రయాణికులు, డ్రైవర్లతో పాటు రైడింగ్ ఇండస్ట్రీపై కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్‌లో పోటీ పెరిగి, ఓలా, ఊబర్‌లకు సవాలుగా నిలిచే అవకాశం ఉంటుంది. ఈ కంపెనీలు తమ మార్కెట్ వాటాను తగ్గించుకునేందుకుగానూ ఛార్జీలను తగ్గించవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే, డ్రైవర్ల ప్రయోజనాలను కూడా మెరుగుపరచడానికి ప్రయత్నించే సూచనలు ఉంటాయి. తమ సేవలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉంటాయి. మొత్తంగా భారత్ ట్యాక్సీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే, భారతదేశ పట్టణ రవాణా స్వరూపాన్ని చాలా వరకు మార్చివేయగలదని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
