DCC Selection: అభిప్రాయ సేకరణ పూర్తయినా తేలని కొత్త డీసీసీ అధ్యక్షుడి పేరు
కార్యకర్తల్లో నెలకొన్న ఉత్కంఠ
మేడ్చల్,స్వేచ్ఛ: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదవి ఎవరిని దక్కుతుందోనన్న (DCC Selection) ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో అభిప్రాయ సేకరణ పూర్తయినా నూతన బాస్ ఎవరు? అనే అంశంపై కార్యకర్తలకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి డీసీసీ అధ్యక్షుల పదవుల భర్తీకి శ్రీకారం చుట్టడంతో పదవిని ఆశిస్తున్న వారు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి డీసీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో అభ్యర్థి నియామకం విషయంలో పార్టీ అధిష్టానం సీనియర్లకు పదవిని అప్పగించేది. అయితే, ఈసారి డీసీసీ అభ్యర్థి పదవిని పారదర్శకంగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నియోజకవర్గాల నేతల అభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించి, దానికి అనుగుణంగా డీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ ప్రక్రియ చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లాలోని 5 నియోజకవర్గాల వారీగా అభిప్రాయ సేకరణను చేపట్టింది.
Read Also- Student Death: ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థి మృతి.. అసలేం జరిగింది?.. తల్లిదండ్రులు ఏమంటున్నారంటే?
జిల్లాలో అభిప్రాయ సేకరణ పూర్తి
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో సైతం నియోజకవర్గాలవారీగా నేతల అభిప్రాయ సేకరణ చేపట్టింది. మేడ్చల్ నియోజకవర్గంలో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా హరి వర్ధన్ రెడ్డితో పాటు మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జంగయ్య యాదవ్, ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మహేందర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వంటి హేమాహేమీలతో పాటు మరికొంతమంది పోటీలో ఉన్నారు. నియోజకవర్గాల నేతల అభిప్రాయ సేకరణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఏఐసీసీ సభ్యురాలు అంజలిని పంపించింది. నియోజకవర్గాల వారీగా నేతల అభిప్రాయ సేకరణను చేపట్టింది. దీనికి సంబంధించిన నివేదికను సైతం పార్టీ అధిష్టానానికి పంపించింది. అయితే, నూతన డీసీసీ అధ్యక్షుల ఎంపిక పెండింగ్‌లో పెట్టడంతో పార్టీ కార్యకర్తలలో ఉత్కంఠ నెలకొంది . ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి నూతన చీఫ్ ఎవరో అర్థంకాక నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
Read Also- Collector Rahul Raj: బాల్యవివాహాలపై మెదక్ జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
ఇప్పుడున్న అధ్యక్షుడికే ఛాన్స్
ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న హరి వర్ధన్ రెడ్డికే డీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్ష పదవి పాతవారికి ఇచ్చేది లేదంటూ పార్టీ అధిష్టానం చెపుతున్నా, హరి వర్ధన్ రెడ్డి పదవీకాలం పూర్తికానందున మళ్లీ ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. డీసీసీ అధ్యక్ష పదవీకాలం ఐదేళ్లు ఉండగా ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్న హరివర్ధన్ రెడ్డి పదవీకాలం ఇంకా పూర్తి కానట్లు తెలుస్తోంది. గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీధర్ తన పదవికి రాజీనామా చేసి పార్టీని వీడిన విషయం తెలిసిందే. తన పదవితో పాటు పార్టీకి శ్రీధర్ రాజీనామా చేయడంతో డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. ఆ స్థానంలో అప్పుడు హరివర్ధన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియామకమయ్యారు. హరి వర్ధన్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పదవీకాలం పూర్తి కాలేదని తెలిసింది. దీంతో పార్టీ పగ్గాలను హరివర్ధన్ రెడ్డికే ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. హరివర్ధన్ రెడ్డి, లేదా వజ్రెష్ యాదవ, లేదా పూన శ్రీశైలం గౌడ్ ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలను అప్పగించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
