Student Death: వరుస ఘటనలతో చర్చనీయాంశంగా మారిన తేజస్వి పాఠశాల
హనుమకొండలోని తేజస్వి హైస్కూల్లో విద్యార్థి మృతి
బ్రెయిన్ డెడ్ కావడంతో చనిపోయినట్టు నిర్ధారణ
ఏదో జరిగి ఉంటుందని తల్లిదండ్రుల అనుమానం
స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆందోళన
హనుమకొండ, స్వేచ్ఛ: హనుమకొండలోని నయీమ్‌నగర్ తేజస్వి హై స్కూల్లో గురువారం ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి (Student Death) చెందాడు. స్కూల్ వివరాల ప్రకారం, నాలుగవ తరగతి చదువుతున్న బానోతు సుజిత్ ప్రేమ్ అనే విద్యార్థి క్లాస్ రూమ్‌లో తాను కూర్చున్న టేబుల్‌పై పడిపోవడంతో, గమనించిన టీచర్ అప్రమత్తం చేసింది. దీంతో స్కూల్ యాజమాన్యం హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. విద్యార్థి బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందాడని ధ్రువీకరించారు.
Read Also- Sanitation Workers: విధులు సక్రమంగా నిర్వహించని పారిశుద్ధ్య కార్మికులకు బ్యాడ్‌న్యూస్!
అయితే, పాఠశాల యాజమజ్యం ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మృతిపై అనుమానం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఏదో జరిగి ఉంటుందంటూ, యాజమాన్యమే తమ పిల్లాడిని కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న బాలుడు ఏ విధంగా చనిపోతాడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వారు ఆందోళన విరమించలేదు. ఆరోగ్యంగా, చురుకుగా ఉన్న తమ బిడ్డ ఎలా చనిపోతాడని యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. పాఠశాల యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికులు పాఠశాల గుర్తింపు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.
స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
తేజస్వి పాఠశాల ముందు తల్లిదండ్రులు, బంధువులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మృతి చెందిన విద్యార్థి బంధువులు పాఠశాలపై దాడి చేశారు. రాళ్లు రువ్.వి ప్లెక్సీలు చింపివేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
10వ తరగతి విద్యార్థి మృతి ఘటన మరువక ముందే..
నయీంనగర్‌లోని తేజస్వి పాఠశాల విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. 45 రోజుల క్రితం 10వ తరగతి చదువుతున్న జయంతి వర్ధన్ అనే విద్యార్థి పాఠశాల గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా హార్ట్ ఎటాక్‌తో కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఆ ఘటన నుంచి విద్యార్థులు తేరుకోకముందే మరో విద్యార్థి మృతి చెందడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
కరీంనగర్లోని తేజశ్రీ పాఠశాల ముందు పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాలలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల అనుమతి రద్దు చేసి పాఠశాల వెంటనే మూసివేయాలని విద్యార్థి సంఘాల నాయకులను డిమాండ్ చేశారు.
