IRCTC Tour Package: దేశంలో ఎన్నో ప్రముఖ శైవ క్షేత్రాలు ఉన్నాయి. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయాలను దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి శైవ భక్తులు తరలివెళ్తుంటారు. ముఖ్యంగా కార్తికమాసంలో జ్యోతిర్లింగాలను దర్శిస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. కాగా బుధవారం (అక్టోబర్ 22) నుంచే కార్తికమాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో శైవ భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. రైలులో 4 జ్యోతిర్లింగాలను దర్శించే అద్భుత అవకాశాన్ని కల్పించింది.
4 జ్యోతిర్లింగాలు ఇవే
ఐఆర్ సీటీసీ (Indian Railway Catering and Tourism Corporation) మరో ఆధ్యాత్మిక యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. 4 జ్యోతిర్లింగాలు & స్టాట్యూ ఆఫ్ యూనిటీ (04 Jyotirlinga & Statue of Unity Yatra) పేరుతో భక్తులకు కొత్త యాత్రను తీసుకొచ్చింది. ఈ యాత్రలో భాగంగా భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా 9 రోజుల్లో 4 జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్), నాగేశ్వర జ్యోతిర్లింగం (ద్వారక), సోమనాథ్ జ్యోతిర్లింగాలతో పాటు గుజరాత్ కెవాడియాలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించవచ్చు.
రైలు యాత్ర సాగుతుందంటే?
భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ పంజాబ్‌లోని అమృతసర్ నుండి ప్రారంభమవుతుంది. తొలుత ఉజ్జయినికి చేరుకొని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించేందుకు ప్రయాణికులకు వీలు కల్పిస్తుంది. రాత్రి బస అనంతరం ట్రైన్ ఓంకారేశ్వర్ వైపు ప్రయాణిస్తుంది. అక్కడ దర్శనం అనంతరం కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఆగుతుంది. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ కు చెందిన అతి భారీ విగ్రహం. ఇక్కడి వాలీ ఆఫ్ ఫ్లవర్స్, సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్ వంటి ఆకర్షణీయ ప్రదేశాలను కూడా ఈ యాత్రలో కవర్ చేయవచ్చు.
Also Read: Kalvakuntla Kavitha: గ్రూప్-1 నియామకాలపై కవిత సంచలనం.. సుప్రీంకోర్టు సీజేఐకి బహిరంగ లేఖ
టికెట్ ధరలు
స్టాట్యూ ఆఫ్ యూనిటీని దర్శించిన తర్వాత యాత్రికులు ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయానికి చేరుకుంటారు. రాత్రి బస అనంతరం.. మరుసటి రోజు నాగేశ్వర జ్యోతిర్లింగం వద్ద జరిగే హారతిని దర్శిస్తారు. ఈ యాత్ర చివరిగా గుజరాత్ లోని సోమనాథ్ జ్యోతిర్లింగం వద్ద ముగుస్తుంది. ఇది దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో మెుట్ట మొదటిదిగా ప్రసిద్ధి చెందింది. తొమ్మిదో రోజున ట్రైన్ తిరిగి అమృతసర్ చేరుతుంది. ఈ యాత్రకు సంబంధించిన టికెట్ ధరలను మూడు కేటగిరీలుగా ఐఆర్‌సీటీసీ విభజించింది. స్లీపర్ క్లాస్ రూ.19,555, 3ఏసీ స్టాండర్డ్ రూ.27,815, 2ఏసీ కంఫర్ట్ రూ.39,410గా టికెట్ ధరను నిర్ణయించారు. ప్రయాణ తేదీలు, ఇతర సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్ సైట్ (IRCTC Tourism website)ను సంప్రదించవచ్చు.
