Kalvakuntla Kavitha: తెలంగాణ పబ్లిక్ కమీషన్ నిర్వహించిన గ్రూప్ – 1 నియమకాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ జాగృతి అధ్యక్షురాలు కవిత సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డీని టీజీపీఎస్సీ (TGPSC) ఉల్లంఘించిందని ఆరోపించారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్ గవాయ్ (Bhushan Ramkrishna Gavai)ను లేఖలో కోరారు. 371-డి ఆర్టికల్ (Article 371-D) కు రిక్రూట్ మెంట్లు జరిగినట్లు అభ్యర్థుల నుంచి తనకు ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.
మా ఉద్యోగాలు మాకే అంటూ తెలంగాణ ఉద్యమం జరిగిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తెలియజేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా రాష్ట్రపతి ఉత్తర్వు ఆర్టికల్ 371-డి ని సాధించుకున్నారన్నారని గుర్తు చేశారు. 371- డి ప్రకారం ఇక్కడి ప్రాంత వాసులకే ఉద్యోగాల్లో అవకాశాలు దక్కాల్సి ఉందన్నారు. కానీ తెలంగాణ సాధించుకున్న పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రజల హక్కులకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్-1 నియామకాల్లో ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించటమే కాకుండా టీజీపీఎస్సీ చాలా తప్పులకు పాల్పడిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఈ కారణంగా స్థానిక తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీ తన చర్యతో అటు రాజ్యాంగంపై ఇటు తెలంగాణ ప్రజల హక్కులపై దాడి చేసిందన్నారు.
Also Read: New Moon: అంతరిక్షంలో అద్భుతం.. భూమికి రెండో చంద్రుడు.. 2080 వరకే ఛాన్స్..!
ఈ అంశంపై అభ్యర్థుల నుంచి వందలాది ఫిర్యాదులు వచ్చినప్పటికీ టీజీపీఎస్సీ పట్టించుకోకపోవటం కచ్చితంగా రాజ్యాంగాన్ని అవమానించటమేనని లేఖలో కవిత అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థుల్లో రాజ్యాంగంపై నాయ్యవ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని చీఫ్ జస్టిస్ కు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షకులైన మీరు జోక్యం చేసుకోవటం ద్వారానే తెలంగాణలో అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని కవిత అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 371- డి ఉల్లంఘనకు పాల్పడిన టీజీపీఎస్సీ వ్యవహారాన్ని సుమోటో గా విచారణ జరపాలని కవిత కోరారు. ఈ మొత్తం అంశాన్ని విచారించి అవకతవకలు జరిగినట్లు తేలితే గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చేపట్టిన గ్రూప్-1 పరీక్ష నిర్వహణ, నియామక ప్రక్రియపై స్వతంత్ర న్యాయపరమైన విచారణకు ఆదేశించాలని చీఫ్ జస్టిస్ కు కవిత లేఖలో విజ్ఞప్తి చేశారు.
