Kavitha on New Party: ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి ‘జనం బాట’ (Janam Bata) కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Yadadri Temple)ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్డీ పెడితే తనకు కాదు.. ప్రజలకు మేలు జరగాలని కవిత పేర్కొన్నారు. 4 నెలల పాటు జనం బాట కార్యక్రమం జరగనున్నట్లు తెలియజేశారు.
ప్రతీ జిల్లాలో 2 రోజులు
యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన అనంతరం కవిత మాట్లాడుతూ.. జనం బాట కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలని స్వామిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకునే శక్తి ఇవ్వాలని వేడుకున్నట్లు తెలిపారు. ‘ఈ నెల 25 నుంచి మా సొంత ఊరు నిజామాబాద్ నుంచి ‘జనం బాట’ కార్యక్రమం మొదలవుతుంది. 33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉండి అక్కడి సమస్యలు తెలుసుకుంటాం. మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తాం. వారు చెప్పే సమస్యలను అర్థం చేసుకొని వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలన్న దానిపై దృష్టి పెడతాం’ అని కవిత అన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాను. అక్టోబర్ 25 నుండి ఫిబ్రవరి 13 వరకు ప్రజలతో మమేకం అయ్యేందుకు చేపట్టబోయే తెలంగాణ జాగృతి "జనం బాట" కార్యక్రమానికి నరసింహ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించాను. pic.twitter.com/tiXK9OeHuA
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 23, 2025
‘యాదాద్రిలో విచిత్రమైన హోర్డింగ్స్’
ప్రజలతో కూలంకషంగా మాట్లాడేందుకు జాగృతికి ఈ కార్యక్రమం వేదికగా మారనుందని కవిత పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చాక యాదాద్రిని కేసీఆర్ చక్కగా పునర్నిర్మించారు. యాదాద్రి ప్రాశ్యస్తాన్ని కాపాడే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. మేము వస్తుంటే విచిత్రమైన హోర్డింగ్ లను చూశాం. అలా కాకుండా తిరుమలలో మాదిరిగా స్వామివారి హోర్డింగ్ లు చిత్రపటాలే ఇక్కడ ఉండేలా చూడాలి. మళ్లీ యాదాద్రికి వస్తాం. అప్పుడు ఇక్కడున్న అన్ని సమస్యలపై వివరంగా మాట్లాడతా’ అని కవిత చెప్పుకొచ్చారు.
Also Read: Mehul Choksi: రూ.13 వేల కోట్లు దోచిన మెహుల్ ఛోక్సీకి.. జైల్లో రాజ భోగాలు.. సౌకర్యాలు తెలిస్తే షాకే!
రాజకీయ పార్టీ గురించి..
మరోవైపు తెలంగాణ జాగృతి ఎన్జీవో గా పుట్టి 19 ఏళ్లుగా కొనసాగుతోందని కవిత గుర్తుచేశారు. ప్రజా సమస్యలతో పాటు రాజకీయ అంశాలను కూడా గతంలో తాము మాట్లాడినట్లు చెప్పారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజకీయాలు, రాజకీయ సమీకరణాలు మాట్లాడటం జరిగింది. సివిల్ సోసైటీ సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాలు పుష్కలంగా మాట్లాడతాం. రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తాం. అందులో ఇబ్బందేమీ లేదు. ఏపీలో మూడు, తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కేరళలో గల్లీకి ఒక పార్టీ ఉంది. పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదు. వాటి వల్ల ప్రజలకు మేలు జరగాలి. నేను పార్టీ పెడితే నాకు లాభం కాదు. ప్రజలకు మేలు జరిగేందుకు ప్రయత్నిస్తా’ అని కవిత తేల్చి చెప్పారు.
ఈ నెల 25 నుంచి మా సొంత ఊరు నిజామాబాద్ నుంచి ‘జనం బాట’ కార్యక్రమం మొదలవుతుంది.
33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం.
ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉండి అక్కడి సమస్యలు తెలుసుకుంటాం.
మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తాం.… pic.twitter.com/l1QDBVgco2
— Telangana Jagruthi (@TJagruthi) October 23, 2025
