Ind Vs WI: దేశరాజధాని న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ – వెస్టిండీస్ జట్ల (Ind Vs WI) మధ్య చివరిదైన రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత మూడు రోజుల్లోనే ముగిసిపోయేలా కనిపించిన ఈ మ్యాచ్ ఐదవ రోజుకు (మంగళవారం) కూడా చేరింది. ఫాలో ఆన్ ఆడిన పర్యాటక వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ ఊహించని రీతిలో పుంజుకొని భారీ స్కోర్ సాధించింది. జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్ సెంచరీలతో చెలరేగడం, చివరిలో జస్టిన్ గ్రీవ్స్ 50 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో 390 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్ అయ్యింది. దీంతో, భారత విజయలక్ష్యం 121 పరుగులుగా ఖరారైంది.
లక్ష్య చేధనలో ఆరంభంలోనే వికెట్
121 పరుగుల సునాయాస లక్ష్యంతో బరిలోకి భారత జట్టు, సోమవారం ఆటముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ భారీ సెంచరీ సాధించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే ఔట్ అయ్యాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన జైస్వాల్.. 7 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు బాదాడు. వ్యక్తిగత స్కోరు 8 పరుగుల వద్ద వర్రికాన్ బౌలింగ్‌లో ఆండర్సన్ ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ ఉన్నారు. రాహుల్ 54 బంతులు ఎదుర్కొని 25 పరుగులు రాబట్టాడు. సాయిసుదర్శన్ 47 బాల్స్ ఎదుర్కొని 30 పరుగులు కొట్టాడు.
విజయానికి మరో 58 రన్స్
వెస్టిండీస్ నిర్దేశించిన 121 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్ మరో 58 పరుగుల దూరంలో నిలిచింది. చేతిలో 9 వికెట్లు ఉండడం, సాధించాల్సిన పరుగులు కూడా తక్కువే కావడం టీమిండియా గెలుపు దాదాపు ఖాయమైంది. ప్లేయర్లు దూకుడుగా ఆడితే తొలి సెషన్‌లోనే మ్యాచ్ ముగిసే అవకాశం ఉంటుంది.
సమష్టిగా రాణించిన బౌలర్లు
తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను కేవలం 248 పరుగులకే ఆలౌట్ చేసిన భారత బౌలర్లు, సెకండ్ ఇన్నింగ్స్‌లో అంతగా ప్రభావం చూపలేకపోయాయి. అయినప్పటికీ సమష్టిగా రాణించి వెస్టిండీస్‌ను ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్‌కు 2, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌కు చెరో వికెట్ పడింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్ 175, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 129, సాయి సుదర్శన్ 87 పరుగులతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 5 వికెట్లు వికెట్లు కోల్పోయిన తర్వాత భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అయితే, వెస్టిండీస్ కేవలం 248 పరుగులకే ఆలౌట్ కావడంతో ఫాల్ ఆన్ ఆడాల్సి వచ్చింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మెరుగుపడిన ఆ జట్లు బ్యాటర్లు.. టీమ్ స్కోరును 390 పరుగుల వరకు తీసుకెళ్లారు.
