Mangalsutra: మంగళ సూత్రంలో ఉండే నల్లపూసలు దుష్టశక్తులు నుంచి దూరం చేస్తాయని అంటున్నారు.
మంగళసూత్రం
దక్షిణ భారతదేశంలో తాళి లేదా తిరుమాంగళ్యం అని పిలుచుకునే మంగళసూత్రం కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక పవిత్రమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక చిహ్నం. ఇది పెళ్ళి బంధం యొక్క లోతైన విలువలు, నమ్మకాలు, ప్రేమను సూచిస్తుంది. హిందూ సంప్రదాయంలో మంగళసూత్రం వివాహం యొక్క పవిత్రతను నొక్కి చెబుతూ, ఇద్దరు ఆత్మలను ఒకటిగా కలిపే శక్తిని కలిగి ఉంటుంది.
మంగళసూత్రం రూపం
మంగళసూత్రం సాధారణంగా పసుపు రంగు దారంతో ఉంటుంది. కొందరు దీన్ని బంగారు లాకెట్టుతో కూడా వేసుకుంటారు. ఈ లాకెట్టులో అదృష్టాన్ని తెచ్చే దేవతల చిత్రాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో ఇది నల్ల పూసలతో కూడిన హారం, బంగారు లాకెట్టుతో కూడిన మంగళసూత్రం ధరిస్తారు. ప్రతి ప్రాంతంలో తాళి డిజైన్, తయారీలో వైవిధ్యం ఉంటుంది.
వివాహంలో మంగళ సూత్రం
వివాహ వేడుకలో, వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని కట్టి, మూడు ముళ్లు వేస్తాడు. ఈ క్షణం భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేస్తూ, వారి జీవితాలను ఒకటిగా కలిపే సంకేతంగా నిలుస్తుంది. మంగళసూత్రం భార్య భర్తల తమ వైవాహిక ప్రమాణాలను గుర్తు చేస్తుంది. ఈ పవిత్ర పసుపు తాడు జీవితాంతం కలిసి ఉండాలనే సంకల్పాన్ని, ఒకరికొకరు తోడుగా నిలవాలనే నమ్మకాన్ని సూచిస్తుంది.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత
మంగళసూత్రంలోని నల్ల పూసలు దుష్టశక్తుల నుండి రక్షణనిస్తాయని, భార్య భర్తలను అన్నీ వేళలా కాపాడుతుందని హిందువులు నమ్ముతారు. ఇది భార్యాభర్తల ఐక్యతను, వారి ఒకరి మీద ఇంకొకరు పెట్టుకున్న నమ్మకాన్ని, ప్రేమను సూచిస్తుంది. ఒకసారి మంగళసూత్రం మెడలో కట్టిన తర్వాత, స్త్రీ దానిని జీవితాంతం ధరిస్తుంది. సంప్రదాయం ప్రకారం, తాళిని మెడ నుండి తీసివేయడం అశుభంగా భావిస్తారు, ఎందుకంటే ఇది భర్త ఆయుష్షును ప్రభావితం చేస్తుందని విశ్వసిస్తారు. అందుకే స్త్రీలు దీనిని ఎప్పుడూ మెడలోనే ఉంచుతారు, ఇది వారి వివాహ బంధం యొక్క నిరంతర గుర్తుగా నిలుస్తుంది.
