Drug Racket: రూ.72 కోట్ల విలువైన ఎఫిడ్రిన్ డ్రగ్ సీజ్
నలుగురు నిందితుల అరెస్ట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారికి చెక్ పెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్న ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ ఫోర్స్ మెంట్ (ఈగల్) అధికారులు ఈ దిశగా గురువారం మరో సక్సెస్ సాధించారు. మాదక ద్రవ్యాల దందా చేస్తూ పట్టుబడ్డ పాతనేరస్తులపై నిఘా పెట్టి, సేకరించిన సమాచారం ఆధారంగా ఎఫిడ్రిన్ డ్రగ్ తయారు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 72 కోట్ల రూపాయల విలువ చేసే 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం (Drug Racket) చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ప్రస్తుతం జీడిమెట్ల ప్రాంతంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ సాయిదత్తా రెసిడెన్సీలో ఉంటున్న వి.శివరామకృష్ణ పరమవర్మ (52) ఆక్వా రైతు. ఎంపీసీ గ్రూప్‌లో గ్రాడ్యుయేషన్ చదివిన పరమవర్మ ఆ తరువాత సిరిస్ కంపెనీలో క్వాలిటీ కెమిస్ట్‌గా కొన్నాళ్లు పని చేశాడు. అక్కడ మానేసిన తరువాత బోయిన్‌పల్లిలోని వెస్టర్న్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో క్వాలిటీ అనలిస్ట్‌గా ఉద్యోగం చేశాడు. 2009లో ఇక్కడ కూడా ఉద్యోగం మానేసి పదేళ్లపాటు రియల్ ఎస్టేట్ దందా చేశాడు. ఈ మధ్యకాలంలోనే తేలికగా డబ్బు సంపాదించేందుకు 2017లో బెంగళూరు ఎన్సీబీ అధికారులకు 250 కిలోల అంఫెటామైన్ డ్రగ్‌తో దొరికాడు. ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన తరువాత 2019లో మరోసారి 10 కిలోల ఆల్ఫ్రాజోలెంతో హైదరాబాద్ ఎన్సీబీ అధికారులకు చిక్కాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కాకినాడ వెళ్లిపోయి ఆక్వా సాగు చేపట్టాడు. కాగా, ఆక్వాలో ఆశించినంత ఆదాయం రాకపోతుండటంతో మరోసారి మాదక ద్రవ్యాల దందా చేయాలని నిర్ణయించుకున్నాడు.
Read Also- Telangana Bandh: రేపు బంద్? ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలో తన స్నేహితుడైన స్వామితో కలిసి ఐడీఏ బొల్లారంలోని పీఎన్ఎం లైఫ్ సైన్సెస్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్న జీడిమెట్ల సుభాష్ నగర్ నివాసి డీ.అనిల్ (31)ను 2024, డిసెంబర్‌లో కలిశాడు. ఆ తరువాత సుచిత్ర ప్రాంతంలోని రాగా బార్‌లో రెండు మూడుసార్లు అనిల్‌కు పార్టీలు ఇచ్చి తాను చెప్పినట్టుగా ఎఫిడ్రిన్ డ్రగ్‌ను ఉత్పత్తి చేసి ఇస్తే భారీ మొత్తంలో డబ్బు ఇస్తానని చెప్పాడు. దీనికి ఆశపడ్డ అనిల్ అంగీకరించాడు. ఆ తరువాత తాను పని చేస్తున్న పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ సంస్థ డైరెక్టర్లయిన ఎం.వెంకట కృష్ణారావు, ఎం.ప్రసాద్‌లకు విషయం చెప్పాడు. పరమవర్మ భారీ మొత్తంలో డబ్బు చెల్లిస్తానని చెప్పటంతో తమ సంస్థలో ఎఫిడ్రిన్ డ్రగ్ ఉత్పత్తి చేయటానికి ఈ ఇద్దరూ అంగీకరించారు. దీనికోసం తమ సంస్థలో ప్రొడక్షన్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఎం.దొరబాబును (29) తమతో కలుపుకొన్నారు.
Read Also- BC Reservations: బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి
ఆ తరువాత పరమవర్మ ఎఫిడ్రిన్ డ్రగ్ తయారీకి సంబంధించిన ఫార్మూలాతో పాటు అవసరమైన ముడిసరుకులను అనిల్‌కు ఇచ్చాడు. దాంతోపాటు ఆన్‌లైన్ ద్వారా 8 లక్షల రూపాయలు కూడా చెల్లించాడు. ఈ క్రమంలో అనిల్ అవసరమైన మరికొన్ని ముడిసరుకులు కొని మిగతా నిందితులతో కలిసి 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్ తయారు చేశాడు. దానిని దత్తసాయి రెసిడెన్సీలోని పరమవర్మ ఫ్లాట్‌లో భద్రపరిచాడు. అనంతరం దానిని కొనేవారి కోసం అంతా కలిసి ప్రయత్నిస్తున్నారు. కాగా, గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ వారిపై నిఘా పెట్టిన ఈగల్ అధికారులు పరమవర్మ కదలికలను కొన్ని రోజులుగా గమనిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అతను డ్రగ్ అమ్మటానికి ప్రయత్నిస్తున్నట్టు నిర్ధారించుకుని గురువారం దత్తసాయి రెసిడెన్సీలోని అతని ఫ్లాట్‌పై దాడి జరిపారు. పరమవర్మ, అనిల్, వెంకట కృష్ణారావు, దొరబాబులను అరెస్ట్ చేసి 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్ ను సీజ్ చేశారు. పరారీలో ఉన్న ప్రసాద్ కోసం గాలిస్తున్నారు. కాగా, ఎఫిడ్రిన్‌ను మెథంఫెటామైన్ డ్రగ్‌గా మారిస్తే దాని విలువ పది రెట్లు పెరుగుతుందని ఈగల్ అధికారుల విచారణలో వెల్లడి కావటం గమనార్హం. డ్రగ్స్ దందా గురించి తెలిస్తే వెంటనే 8712661111 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఈగల్ అధికారులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు. దాంతోపాటు తగు రివార్డులు కూడా అందచేస్తామని పేర్కొన్నారు.
