BC Reservations: స్థానిక ఎన్నికలపై హైకోర్టు గడువు సమీపిస్తుండటంతోనే జీవో జారీ
బీఆర్ఎస్ నిందలు వేయడం తగదు
కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్లకు (BC Reservations) సంబంధించిన జీవో ఇవ్వాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబరు 30లో పు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ కటాఫ్ 50 శాతం చేస్తూ చట్టం చేసిందన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని గత ప్రభుత్వం ప్రయత్నించలేదన్నారు. కానీ తమపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీసీలంటే ఆ రెండు పార్టీలకు చులకనగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎంపిరికల్ డేటా లేకుండా రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారు? అని కోర్టు ప్రశ్నించిందని, అందుకే జీవో 9 తీసుకువచ్చేందుకు సర్వే చేశామన్నారు. ఇది సైంటిఫిక్ సర్వే అన్నారు. వాటిని బిల్లు రూపంలో తీసుకువచ్చి, పొరపాటు జరగకుండా సర్వే చేశామన్నారు. బిల్లు, ఆర్డినెన్స్ లు గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయన్నారు. తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినా… కోర్టుల్లో అడ్డుకోవడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. బిల్లులపై గవర్నర్ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉన్నదని వివరించారు. ఈ మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోక్స్‌పర్సన్ ఇందిరా శోభన్ తదితరులు ఉన్నారు.
Read Also- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి రండి.. చైనా తర్వాత హైదరాబాద్ బెస్ట్.. అమెరికాకు సీఎం పిలుపు
‘స్టే’ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే: రాంచందర్ రావు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో నంబర్ 9పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించడానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు కేసును నాలుగు వారాలకు వాయిదా వేసిందని, కోర్టు స్టే విధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలే కారణమని విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకుందని మండిపడ్డారు. నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని గుర్తుచేశారు.
Read Also- Telangana Bandh: రేపు బంద్? ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేశారని రాంచందర్ రావు తెలిపారు. గవర్నర్ కు బిల్లు పంపించి మూడు నెలలు కూడా అవ్వలేదని, ప్రభుత్వం ఏమాత్రం ఓపిక పట్టలేదని ఫైరయ్యారు. జీవో ఇచ్చి షెడ్యూల్ ప్రకటించడం వెనక ఉన్న మతలబేంటని రాంచందర్ రావు ప్రశ్నించారు. కేవలం బీజేపీని బద్నాం చేసేందుకే ఈ నాటకాలని విరుచుకుపడ్డారు. హైకోర్టు స్టేకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, వెంటనే సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రాజకీయ స్వలాభం కోసం బీసీల హక్కులను కాంగ్రెస్ పణంగా పెట్టిందని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసినవారు కాంగ్రెస్‌కు చెందినవారేనని రాంచందర్ రావు ఆరోపించారు. ఇదిలా ఉండగా తొలుత సినీ నటుడు జేఎల్ శ్రీనివాస్, మాజీ సైనికుడు, బ్యాంకు రిటైర్డ్ అధికారి జీఎల్ కృష్ణారావు, భగవద్గీత ఫౌండేషన్ సీఈవో స్వాతి మీనన్ రాంచందర్ రావు అధ్యక్షతన నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీలో చేరారు. కాగా వారికి రాంచందర్ రావు కండువా కప్పి ఆహ్వానించారు.
