CM Revanth Reddy: అగ్రరాజ్యం తీసుకునే నిర్ణయాలు అమెరికా, భారత్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇటీవల అమెరికా పెంచిన సుంకాలు, హెచ్ 1 బీ వీసాలపై విధించిన కఠిన నిబంధనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయటంతో పాటు అస్థిరతకు, అపార్థానికి దారి తీస్తాయన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు.
రాష్ట్రాభివృద్ధికి.. ఉత్తమమైన విధానాలు
అమెరికాలోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ (Hudson Institute) కు చెందిన 16 మంది ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో భేటి అయ్యారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య వ్యవహారాలు, విధి విధానాలపై ఈ బృందం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ కు రాగా వారితో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను వారికి వివరించారు. పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఉత్తమమైన విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
‘మా లక్ష్యం అదే’
ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని సీఎం అన్నారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయన్నారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో మరియు దక్షిణ కొరియాతో పోటీ పడుతోందని చెప్పారు. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని 2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి అన్నారు.
గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులు
మరోవైపు హైదరాబాద్లో గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, మాన్యుఫాక్చర్ జోన్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. డ్రై పోర్ట్ ఏర్పాటు చేసి పొరుగున ఉన్న ఏపీలో మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్ కనెక్టివిటీ ఉండేలా రవాణా సదుపాయాలు విస్తరిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి అటు చైన్నై వరకు, ఇటు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయని అన్నారు. సిటీలో ఇప్పుడున్న మెట్రో రైలును అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు చెప్పారు.
Also Read: TG High Court: హైకోర్టు సంచలన తీర్పు.. బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై స్టే
‘ఫ్యూచర్ సిటీకి రండి’
30 వేల ఎకరాల్లో హైదరాబాద్ లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వామ్యాన్ని, మద్దతును ఆహ్వనిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయని మొత్తం 500 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావాలని ఫ్యూచర్ సిటీలో పాలుపంచుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. చైనా+1 వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని, అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
