TG High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తీసుకొచ్చిన జీవో 9 పై న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. నాలుగు వారాల్లోగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు రెండు వారాల గడువు సైతం పిటిషనర్లకు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై రెండ్రోజుల పాటు విచారించిన హైకోర్టు.. ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రాష్ట్ర బంద్ కు పిలుపు
బీసీ రిజర్వేషన్ల జీవోపై స్టే విధించడాన్ని బీసీ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. హైకోర్టు ఎదుట మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు.. 4 వారాలు స్టే అంటే తమకు అన్యాయం జరిగినట్లేనని పేర్కొన్నారు. ఇది తనకు చాలా బాధ కలిగిస్తోందని వాపోయారు. ఇలా ఎన్ని రోజులు బీసీలకు అన్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవాళే విడుదలైందన్న హనుమంతరావు.. ఈ సమయంలో స్టే విధించడం సమంజసం కాదని అన్నారు. మరోవైపు రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి.
వాదనలు ఏం జరిగాయంటే?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జీవో (నెంబర్ 9)ను కూడా విడుదల చేసింది. కాగా, రిజర్వేషన్లను సవాల్ చేస్తూ మాధవరెడ్డి, రమేశ్ అనే వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. కాగా, రిజర్వేషన్లకు అనుకూలంగా బీసీ నేత ఆర్.కృష్ణయ్య, వీ.హనుమంతరావుతోపాటు మరో 26మంది బీసీ నాయకులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.కే.సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రెండో రోజైన గురువారం కూడా మరోమారు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయ స్థానం వాదనలు విన్నది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు మొదటగా వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లను పెంచే అధికారం ప్రభుత్వానికి ఉన్నా అవి 50 శాతానికి మించరాదని చెప్పారు. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా ఉన్నాయన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ సర్వే నిర్వహించే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ వాదించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో.. అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. రిజర్వేషన్ల జీవోపై స్టే విధించింది.
స్టే విధిస్తారని అనుకోలేదు: పొన్నం
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ‘హైకోర్టులో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాం. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్, సబ్ కమిటీ వేసింది. అనంతరం కేబినేట్, శాసనసభ ఆమోదించి బిల్లును చట్టం రూపంలో మార్చేందుకు గవర్నర్ కు ఆమోదం కోసం పంపాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్’ అని మంత్రి చెప్పుకొచ్చారు.
