R-Krishnaiah
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Telangana Bandh: రేపు బంద్? ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

Telangana Bandh: బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే

ఉద్యమం చేస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరిక
హైకోర్టు వద్ద కాసేపు ఉద్రిక్తత

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై (నెంబర్ 9) తెలంగాణ హైకోర్టు గురువారం స్టే విధించిన విషయం తెలిసిందే. హైకోర్టు నిర్ణయం పట్ల బీసీ సంఘాల నాయకులు భగ్గుమన్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైకోర్టు 4వ నెంబర్ గేటు వద్ద ఆయా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యమనేత ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బీసీలకు నోటిదాకా వచ్చిన ముద్దను అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తొందరపాటు చర్యల కారణంగానే ఈ అన్యాయం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం స్పందన వచ్చిన తరువాత భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ స్పందన చూశాక, రాష్ట్రవ్యాప్త బంద్‌కు (Telangana Bandh) పిలుపునిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు పదవులు దక్కుతుంటే కొందరు ఓర్వలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమైన రిజర్వేషన్లను సాధించుకోవటానికి మండల్ కమిషన్ లాంటి ఉద్యమాన్ని నిర్మిస్తామని అన్నారు. తదుపరి కార్యాచరణను రూపొందించుకుని బీసీల సత్తా ఏంటో నిరూపిస్తామన్నారు. మరోవైపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ శుక్రవారం (అక్టోబర్ 10) రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.

ఆ రెండు పార్టీల వల్లే…

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కారణంగానే రిజర్వేషన్ల విషయంలో ఈ పరిస్థితి వచ్చిందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీధర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. హైకోర్టులో రెండో రోజు వాదనల సందర్భంగా ఈ ముగ్గురూ కోర్టుకు వచ్చి వాదనలు విన్నారు. హైకోర్టు స్టే విధించిన అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. గవర్నర్​ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండటానికి కారణం బీజీపీ అని ఆరోపించారు. ఇక, బీఆర్ఎస్‌కు కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం ఇష్టం లేదని మంత్రులు మండిపడ్డారు. అందుకే కోర్టులో విచారణ జరుగుతున్నా కనీసం ఇంప్లీడ్​ పిటిషన్ వేయలేదన్నారు. అయినా, కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు న్యాయ పోరాటంతోపాటు వీలైన అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

Read Also- GHMC: హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం.. నీరు సాఫీగా వెళ్లేందుకు.. జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్!

హైకోర్టులో అనూహ్య పరిణామాలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయటానికి ప్రభుత్వానికి 4 వారాల గడువిచ్చింది. ప్రభుత్వ కౌంటర్‌పై అభ్యంతరాలు తెలియజేయటానికి పిటిషనర్లకు మరో రెండు వారాల సమయం ఇచ్చింది. కాగా, రిజర్వేషన్లపై స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు అయింది. కాగా, 9వ నెంబర్​ జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో బీసీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా, బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై హైకోర్టులో రెండో రోజు విచారణ అడ్వకేట్​ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలతో ప్రారంభమైంది. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ తరువాత ఇంటింటికి వెళ్లి సర్వే చేసినట్టు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని చెప్పారు. సర్వే జరిగినపుడు ఏ ఒక్కరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు.

ఇక, సర్వేలో బీసీ జనాభా 57.6శాతం ఉన్నట్టుగా స్పష్టమైందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టినపుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతులను పలికాయన్నారు. అనంతరం ఈ బిల్లును ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్, భారత రాష్ట్రపతికి పంపించటంతోపాటు ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పారు. మార్చి నుంచి బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నట్టు చెప్పారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరు నెలలు గడిచిపోయిన నేపథ్యంలో బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించినట్టుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు.

Read Also- Rinku Singh: రింకూ సింగ్‌కు దావూద్ ఇబ్రహిం గ్యాంగ్ బెదిరింపులు!.. ఏం అడిగారంటే?

మరో సీనియర్ న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లపై రాజ్యాంగంలో ఎలాంటి సీలింగ్ లేదని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిపి 85శాతం జనాభా ఉన్నట్టు చెప్పారు. ఈ మూడు సామాజిక వర్గాలకు సంబంధించి బీసీలకు కల్పించిన 42శాతం రిజర్వేషన్లతో కలిపి 67శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నట్టు వివరించారు. మిగితా 15శాతం జనాభాకు 33శాతం ఇంకా ఓపెన్​ గానే ఉన్నట్టు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత హైకోర్టు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయటానికి ప్రభుత్వానికి 4వారాలపాటు సమయం ఇచ్చింది. ఇక, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు రెండు వారాల్లోపు కౌంటర్ ద్వారా తెలియచేయాలని పేర్కొంది. రిజర్వేషన్ల జీవోపై స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆరు వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్టయ్యింది.

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..