VC Sajjanar: ఈ మధ్యకాలంలో నగరం, గ్రామీణ ప్రాంతమనే వ్యత్యాసం లేకుండా ఎక్కడచూసినా నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ సమస్య ఎక్కువైపోతోంది. డ్రైవర్లు మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తూ, ఇయర్‌ఫోన్ల ఉపయోగించి ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపడం సర్వసాధారణ దృశ్యాలుగా మారిపోయాయి. ఈ విధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, ఒకచేతితో మొబైల్ పట్టుకొని వాహనాలు నడపడం ఆందోళనకరంగా మారింది. ఈ ధోరణి సదరు నిర్లక్ష్యపూరిత డ్రైవర్లతో పాటు రోడ్లపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా పరిణమిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో నెలకొన్న ఈ పరిస్థితిని గుర్తించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar), మంగళవారం (అక్టోబర్ 7) వాహన చోధకులను హెచ్చరించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వినియోగాన్ని నివారించాల్సిందేనని హెచ్చరించారు. కేవలం రోడ్డు భద్రతపై దృష్టి పెట్టి డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.
Read Also- Rinku Gifts Sister: లక్ష రూపాయలతో చెల్లికి విలువైన బహుమతి కొనిచ్చిన రింకూ సింగ్.. ఏం ఇచ్చాడంటే?
‘‘రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు ఎవరి భద్రత వారు చూసుకోవడంతో పాటు మిగతా ప్రయాణికుల భద్రతను కూడా అత్యంత ముఖ్యంగా భావించాలి. చాలా మంది ఆటో, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు వాహనం నడుపుతూ వీడియోలు చూడడం, లేదా ఇయర్‌ఫోన్లు పెట్టుకొని ఫోన్లు మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది. శిక్షార్హమైన చర్య కూడా. ఈ తరహా డ్రైవర్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. జీవితం కన్నా ఏదీ ముఖ్యం కాదు. దయచేసి ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయండి, సురక్షితంగా ఉండండి’’ అని సజ్జనార్ సూచించారు.
కాగా, రోడ్డుపై ప్రయాణ సమయంలో చాలా మంది ఆటో, లేదా బైక్ టాక్సీ డ్రైవర్లు ప్రయాణికులను తీసుకెళ్లుతున్న సమయంలో కూడా మొబైల్ వాడుతున్నారు. రీల్స్ చూడడం, యూట్యూబ్ వీడియోలు చూడటం షరా మామూలుగా మారిపోతోంది. కొంతమంది డ్రైవర్లు ఇయర్‌ఫోన్లతో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా మరికొందరు ఒక చేతితో వాహనం నడుపుతూనే, మరో చేతిలో ఫోన్‌కాల్స్ మాట్లాడుతున్నారు. ఈ ధోరణి రోడ్డు ప్రమాదాలను పెంచుతోంది. నిర్లక్ష్యపూరిత డ్రైవర్ల కారణంగా రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. డ్రైవర్లు ఫోన్ ఉపయోగించడంపై కొందరు ప్రయాణికులు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓ వ్యక్తి బైక్ రైడ్ బుక్ చేసుకున్నాడు. బైక్ రైడర్ జర్నీ సమయంలో మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూస్తున్నట్టు సదరు ప్యాసింజర్ గమనించాడు. డ్రైవింగ్‌లో ఫోన్ వాడడం ఏమిటని ప్రశ్నించగా, తనకు ఇది అలవాటేనంటూ సదరు రైడర్ సమాధానం ఇచ్చాడు. దీనిని బట్టి డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ల వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
