Mohsin Naqvi: ఆసియా కప్ 2025ను సొంతం చేసుకున్న టీమిండియాకు ట్రోఫీని బహుకరించకుండా, ట్రోఫీని ఎత్తుకుపోయిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పీసీబీ అధ్యక్షుడు మోహ్సిన్ నక్వీ (Mohsin Naqvi) ఇబ్బందులు కొనితెచ్చుకున్నాడు. ట్రోఫీ అందించకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీసీసీఐ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి నక్వీని తొలగించాలని భావిస్తోంది. ఇందుకోసం ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. ఆసియా కప్ ట్రోఫీని అందివ్వకపోవడమే కాదు, గతంలో కూడా ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడడంతో తగిన బుద్ధి చెప్పాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారని సమాచారం. మోహ్సిన్ నక్వీ వ్యవహార శైలి ఏసీసీతో పాటు ఐసీసీ పరిపాలనా నైతికతను దెబ్బతీసే విధంగా ఉందని బీసీసీఐ పెద్దలు మండిపడుతున్నారు.
యూఏఈ బోర్డు వద్ద ట్రోఫీ!
ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను భారత జట్టు మట్టికరిపించింది. అయితే, పాకిస్థాన్ మంత్రిగా ఉన్న మోహ్సిన్ నక్వీ నుంచి ట్రోఫీ అందుకునే టీమిండియా ప్లేయర్లు నిరాకరించారు. దీంతో, ట్రోఫీ పట్టుకొని ఆయన మైదానం వీడి వెళ్లిపోయారు. కాగా, ప్రస్తుతం ఆ ట్రోఫీ యూఏఈ క్రికెట్ బోర్డు వద్ద ఉందని సమాచారం. అయితే, ట్రోఫీని ఎవరు, ఎప్పుడు భారత జట్టుకు అందిస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
Read Also- Viral Post: రూ.14 లక్షల జీతంతో కొత్త జాబ్.. చేరిన తొమ్మిదో రోజే యువకుడు రిజైన్.. ఎందుకంటే?
ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఆగ్రహం
ఇటీవలే ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఈ భేటీలో నక్వీపై బీసీసీఐ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటో కాల్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడడంతో పాటు అనైతికంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నక్వీ తన పదవికి సంబంధించిన బాధ్యతలను పాటించడం లేదని ఆరోపించారు. ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీని అప్పగించకపోవడం ఉల్లంఘనేనని, క్రీడా నైతికతను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. విజేతలను గౌరవించడం ఏసీసీ చీఫ్ ప్రధాన కర్తవ్యమని, కానీ, నక్వీ ఉల్లంఘించారని బీసీసీఐ ప్రతినిధులు మండిపడ్డారు. అంతర్జాతీయంగా భారత జట్టును అవమానించే చర్యకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు.
వ్యక్తిగత ద్వేషం సరికాదు
మోహ్సిన్ నక్వీ ఆసియా కప్ ట్రోఫీ అప్పగించకపోవడం వెనుక బహుశా వ్యక్తిగత లేదా రాజకీయ అసహనం కారణమై ఉండొచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రోఫీతో పాటు ప్లేయర్స్ మెడల్స్‌ను కూడా తనపాటు హోటల్ గదికి తీసుకెళ్లడం ‘నిబంధనల ఉల్లంఘన’ కిందకు వస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. క్రికెట్‌కు మరింత వన్నె తేవాల్సిన పదవిలో ఉండి, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందిపోయి, కళంకం తీసుకొచ్చే విధంగా నక్వీ ప్రవర్తించాడంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నక్వీపై చర్యలు తీసుకోవాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై త్వరలోనే ఏసీసీలో నిర్ణయం తీసుకోవచ్చని అంచనాగా ఉంది. మోహ్సిన్ నక్వీ చర్య క్రీడల్లోకి రాజకీయాలను లాగినట్టుగా ఉంది. ఒక ప్రాంతీయ క్రికెట్ మండలికి అధినేతగా ఉండి, నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- Richest Indians: సంపన్నుల లిస్ట్ విడుదల.. బిలియనీర్ల జాబితాలోకి షారుఖ్.. ఎవరి ఆస్తి ఎంతంటే?