DA increase 2025: దసరా పండుగకు సరిగ్గా ఒక్క ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వచ్చింది. ఉద్యోగులకు 3 శాతం డీఏ (డియర్‌నెస్ అలవెన్స్), పెన్షనర్లకు 3 శాతం డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) పెంపునకు కేంద్ర ప్రభుత్వం (DA increase 2025) ఆమోదం తెలిపింది. పెంచిన డీఏ, డీఆర్ జులై 1 నుంచి వర్తిస్తాయని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణ బుధవారం మధ్యాహ్నం వెల్లడించారు. దీంతో, దసరా, ఈ నెల చివరిలో దీపావళి సందర్భంగా ఉద్యోగులకు చక్కటి కానుక ఇచ్చినట్టు అయింది. తాజా పెంపు ప్రకారం, ఒక ఉద్యోగి బేసిక్ వేతనం రూ.60,000 ఉందనుకుంటే డీఏ రూపంలో అదనంగా రూ.34,800 అందుతుంది. అదే మార్చి నాటి పెంపు ప్రకారం అయితే, రూ.33,000 మాత్రమే వస్తాయి.
కాగా, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లిస్తుంటారు. డీఏ, డీఆర్ పెంపుదల ఉంటుందంటూ గత కొన్ని రోజులుగా అంచనాలు నెలకొన్నాయి. వినియోగదారుల ధర సూచి ఆధారిత ద్రవ్యోల్బణం, టోకు ద్రవ్యోల్బణం రెండూ పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఊహించిన విధంగానే బుధవారం ప్రకటన వెలువడింది. కాగా, ఈ ఏడాది డీఏ, డీఆర్ పెంచడం ఇది రెండవసారి కావడం గమనార్హం. మార్చి నెలలో 2 శాతం పెంచారు. దీంతో, బేసిక్ చెల్లింపులో డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి చేరింది.
Read Also- Richest Indians: సంపన్నుల లిస్ట్ విడుదల.. బిలియనీర్ల జాబితాలోకి షారుఖ్.. ఎవరి ఆస్తి ఎంతంటే?
మరోవైపు, జీతాల పెంపు, ఇతర అలవెన్స్‌లపై తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన 8వ వేతన సంఘం నిర్ణయించనుంది. అయితే,కమిషన్ సభ్యుల వివరాలు, నిబంధనలను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ‘ఫిట్‌మెంట్ ఫాక్టర్’ (Fitment Factor) ఆధారంగా జీతాలు ఎంత పెరుగుతాయనేది స్పష్టమవుతుంది. ఫిట్‌మెంట్ ఫాక్టర్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు కోసం ఉపయోగించే ఒక గుణకం (multiplier). వేతన సంఘం సిఫారసుల ప్రకారం, కొత్త జీతాన్ని ఎలా లెక్కించాలో నిర్ణయించడానికి ఉపయోగిస్తారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం, 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫాక్టర్ 1.83 నుంచి 2.86 మధ్య ఉండొచ్చని అంచనాగా ఉంది. దీని ప్రకారం చూసుకుంటే, సుమారు 13 శాతం నుంచి 34 శాతం వరకూ జీతం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం 55 శాతంగా ఉన్న డీఏ బేసిక్ శాలరీలో కలిసిపోయి సున్నాగా మారుతుంది. ఇది జనవరి 1, 2026 నుంచి అమలులోకి రానున్న కమిషన్ సిఫారసుల ప్రకారం జరుగుతుంది. ప్రక్రియ మొత్తం పూర్తయితే, 2026 జనవరి 1 నుంచి పే కమిషన్ సిఫార్సులు అమలు చేసే అవకాశం ఉంది.
Read Also- US shutdown: అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్.. విమాన, రైలు సర్వీసులు నిలిచిపోతాయా?
బేసిక్ పెరుగుదల తక్కువగానే అపిపించవచ్చు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనకరమేనని నిపుణులు చెబుతున్నారు. పింఛన్లు, డీఏ బేసిక్ శాలరీతో ముడిపడి ఉంటాయని చెబుతున్నారు. కాగా, 7వ వేతన సంఘం దాదాపు 200 అలవెన్స్‌లను సమీక్షించింది. అందులో 52 అలవెన్స్‌లను రద్దు చేసి, వేరేవాటిలో విలీనం చేసింది. జీతాలు లెక్క గట్టే విధానంలో పారదర్శకత, సులభంగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశంగా ఉంది.