Kavitha: నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు
20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం కష్టపడ్డ
కొందరిలో స్వార్థం ప్రవేశించింది
వారివల్ల కోట్లాది మంది బాధ పడొద్దన్నదే నా తపన
తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతుకమ్మ వచ్చే వరకు పోరాడుదాం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పార్టీ ఏర్పాటుపై ఇప్పటివరకు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తెలంగాణ జాగృతిని దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలపాలన్నదే తన సంకల్పమని ఎంఎల్సీ కవిత అన్నారు. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పని చేస్తుందని, అవసరం అయితే, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే తాను పార్టీ పెడుతానని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో సోమవారం లండన్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం అక్కడి తెలంగాణ ప్రజలతో ముఖాముఖి ముచ్చటించారు.
‘‘తొవ్వ ఎంత కఠినమైనా పోవాలనుకున్నప్పుడే పోవుడే. నేను ఈ పరిస్థితికి రావడానికి అవతలి వాళ్లే కారణం. ఇలాంటి పరిస్థితులు కల్పించినప్పుడు నేను మామూలు బిడ్డను కాదు. తెలంగాణ బిడ్డను. కేసీఆర్ బిడ్డను. కష్టమైతదని నాకు తెలుసు. అయినా ధైర్యంగా నా పంథాను ఎంచుకుంటాను. జాగృతిని మరింత బలోపేతం చేస్తా. జాగృతి తరపున మరిన్ని కార్యక్రమాలు చేపడుతా ’’ అని కవిత పేర్కొన్నారు.
తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని, తాను 20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం కష్టపడ్డానని ఆమె పునరుద్ఘాటించారు. ‘‘ దురదృష్టకర పరిస్థితుల్లో నిరుడు బతుకమ్మ సంబురాలకు దూరంగా ఉన్నాను. ఈ ఏడాది చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మ వేడుకల్లో పాలు పంచుకున్నాను. తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతుకమ్మ వచ్చే వరకు పోరాడుదాం. లండన్‌లో పెద్ద ఎత్తున తెలంగాణ ఆడబిడ్డలు తరలిరావడం నాకు సంతోషంగా ఉంది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్‌లో చీలికలు రావొద్దనే ఎంత ఇబ్బంది అయినా తట్టుకొని నిలబడ్డాను. పార్టీ బాగుండాలి, బీఆర్ఎస్ వల్ల తెలంగాణ బాగుండాలని ఎంతో తగ్గి ఉన్నాను. నాకు పార్టీలో చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. నాకు ఓటమి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయి. ఆడబిడ్డగా కుటుంబం బాగుండాలని, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో నేను ఎంతగా సఫర్ అయినా ఏ ఒక్క విషయం కూడా బయటకు చెప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే నేను మాట్లాడాల్సి వచ్చింది. విషయాలు ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాటిపై స్పందించకపోతే, మాట్లాడకపోతే అది తా తప్పు అవుతుంది. అందుకే నేను రియాక్ట్ కావాల్సి వచ్చిందే తప్ప ముందే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ విషయం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తోంది. నేను విదేశాల్లో ఉన్నప్పుడు అనవసరంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారు. ఇలాంటి విషయాలన్ని నేను ప్రజల ముందు ఉంచాను’’ అని కవిత వివరించారు.
Read Also- POK Protests: పీవోకేలో కల్లోలం.. సామాన్యులపై ఆర్మీ, ఐఎస్ఐ కాల్పులు.. ఇద్దరు మృతి
తనను పార్టీ నుంచి బయటికి పంపడంతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని కవిత ప్రస్తావించారు. ‘‘తెలంగాణవాళ్లకు రోషం ఎక్కువ ఉంటుంది. నేను కూడా తెలంగాణ బిడ్డనే. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశాను. చైర్మన్ ఎందుకు ఆమోదించడం లేదో నాకు తెలియదు. కాంగ్రెస్ పాలిటిక్స్‌లో అది ఒక భాగం కావొచ్చు. త్వరలోనే చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి రాజీనామా ఆమోదింపజేసుకుంటాను. తెలంగాణ సాధన కోసం నిఖార్సుగా, ప్రాణం పోయినా పర్వలేదు అని పోరాటం చేసిన కొందరిలో రానురాను స్వార్థం ప్రవేశించింది. వాళ్లు మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించేలా పని చేశారు. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ పోవాలి. కానీ అది జరగలేదు అన్నది నా ఆవేదన. కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసం కోట్లాది మంది ప్రజలు సఫర్ కావడం మంచిది కాదు. వాటిని ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ సరి చేసుకుంటే బాగుంటుంది’’ అని కవిత సూచించారు.
Read Also- Maa Mundeshwari Temple: దేశంలోనే వింతైన ఆలయం.. మేకను బలిస్తారు కానీ.. ఒక్క చుక్క రక్తం కారదు!
జైలు జీవితం తనలో అనేక మార్పులు తీసుకువచ్చిందని కవిత గుర్తుచేసుకున్నారు. ‘‘నేను చిన్నప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉన్నాను. కష్టాలను చూడటం వేరు, కష్టాలు అనుభవించడం వేరు. నేను జైలుకు వెళ్లినప్పుడు సామాన్యుడు, ఒక స్త్రీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అన్నది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. జైలు జీవితం నన్ను సమూలంగా మార్చేసింది. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే స్పష్టమైన ఆలోచనకు నాకు ఉంది. తప్పనిసరిగా నాకు అవకాశం వస్తుంది. మహిళా రిజర్వేషన్ల కోసం ముందుండి కొట్లాడి సాధించుకున్నాం. బీసీ రిజర్వేషన్ల కోసం నేను ముందుండి కొట్లాడుతున్నాను. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సి ఉంది. ప్రజలకు ఏది మంచి చేస్తుందో ఆ దిశగా నా అడుగులు ఉంటాయి. పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. వాళ్లే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటారు. రియల్ సోషల్ ఛేంజ్ కేసీఆర్ ద్వారా, తెలంగాణ ఉద్యమం ద్వారానే జరిగింది. ఇప్పుడు మళ్లీ రియల్ ఛేంజ్ కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పని చేయాలి’’ అని కవిత పిలుపు నిచ్చారు.