Doctors Recruitment: 1,642 డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తాం
జోగిపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్
వైద్యుల రిక్రూట్‌మెట్ చేస్తామని
ప్రతీ కేసును సంగారెడ్డికి రెఫర్ చేయొద్దని సూచన
బయటకు మందులు రాయొద్దని ఆదేశాలు
జోగిపేట, స్వేచ్ఛ: రాష్ట్రంలో ఈ నెలాఖరులోగా 1,642 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ (Doctors Recruitment) ప్రకటించి భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ వెల్లడించారు. శనివారం ఆయన జోగిపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డెలివరీ వార్డులో రిజిష్టర్‌ను పరిశీలించి సర్జరీ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని, నార్మల్ డెలివరీలు తక్కువ అవుతున్నాయని అన్నారు. ఆసుపత్రికి వచ్చే కేసులను సంగారెడ్డి ఆసుపత్రికి షిఫ్ట్ చేయవద్దని సూపరిండెంట్ డాక్టర్ సౌజన్యకు ఆయన సూచించారు. ఆసుపత్రిలో డెలివరీలు పెంచాలని ఆదేశించారు.
ఆసుపత్రిలోని పురుషుల, స్త్రీల వార్డులతో పాటు, డయాలసిస్ సెంటర్, అవుట్ పేషెంట్‌ల రిజిస్టర్‌ను అజయ్ కుమార్ స్వయంగా పరిశీలించారు. పురుషుల వార్డులోకి వెళుతూ స్త్రీలను ఇందులో ఎందుకు చేర్చుకున్నారని సిబ్బందిని ప్రశ్నించారు.
వైద్య సదుపాయాలు అందుతున్నాయా?
ఆసుపత్రిలో చేరిన రోగుల వద్దకు వెళ్లి వైద్య సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా? డాక్టర్లు, సిబ్బంది మీతో బాగానే ఉంటున్నారా?, భోజనం పెడుతున్నారా? అని అడిగి మరీ వివరాలు తెలుసుకున్నారు. వార్డులో ఉన్న రోగికి ఆపరేషన్ ఉందని, పరీక్షలు చేయించాల్సి ఉందని రోగి చెప్పగా, రోగి వద్దకే వచ్చి పరీక్షలు చేయించాలని కమిషనర్ ఆదేశించారు. డయాలసిస్ సెంటర్ రోగిని కూడా పరిశీలించి ఎన్ని రోజులకోసారి వస్తున్నారని, సేవలు బాగానే ఉన్నాయా? అని ప్రశ్నించగా మంచిగానే చూస్తున్నారని రోగులు సమాధానం ఇచ్చారు.
Read Also- Shivaji Controversy: హీరోయిన్ దుస్తుల వివాదంపై సుమన్ చెప్పింది ఇదే.. వారు ఏం చేసేవారంటే?
డాక్టర్లు… డాక్టర్ల మాదిరే ఉండాలి…
ఆసుపత్రిలోని ఓపీ వార్డును పరిశీలించిన కమిషనర్‌కు డాక్టర్లు సివిల్ డ్రెస్‌లో స్టెతస్కోప్, ఆఫ్రాన్ లేకుండా కనిపించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇద్దరం రోడ్డుపైకి వెళదాం. మనల్ని డాక్టర్ అని అంటారో అనరో చూద్దాం’’ అని కమిషనర్ మృదువుగా హెచ్చరించారు. డాక్టర్లు డాక్టర్ల మాదిరిగానే ఉండాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. డాక్టర్లు తప్పనిసరిగా స్టెతస్కోప్‌ను, ఆప్రాన్‌ను ధరించాలని ఆదేశించారు. ఆ సమయంలో కమిషనర్ వెంట ఉన్న సూపరిండెంట్ సైతం స్టెతస్కోప్, ఆఫ్రాన్ ధరించకపోవడం విశేషం. అయితే, తర్వాత తెప్పించుకున్నారు.
బయటకు మందులు రాయొద్దు…
ఆసుపత్రిలోని మందులు నిల్వ ఉన్న గదిలోకి వెళ్లి మందుల కొరత ఏమైనా ఉందా?, రోగులకు మందులు తెచ్చుకోవాలని బయటకు రాస్తున్నారా? అని కమిషనర్ అజయ్ కుమార్ ప్రశ్నించారు. ఎవ్వరికి మందులు బయటకు రాయరని, అన్ని మందులు ఉన్నాయని, లేనట్లయితే తెప్పించి ఒక్క రోజులో రోగులకు అందజేస్తున్నామని సూపరిండెంట్ సూచించారు. మందుల కొరత రానివ్వొద్దని తెలిపారు.
ఆక్సిజన్ ప్లాంట్‌ను వినియోగంలోకి…
ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్‌ను అవసరం ఉంటే వాడుకోవచ్చునని, రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లు అందుబాటులో ఉన్నాయని కమిషనర్ తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

