Crime News: నేరపూరిత స్వభావం ఉన్న వ్యక్తుల మైండ్‌సెట్ చాలా ప్రమాదకరంగా (Crime News) ఉంటుంది. చావు తెలివితేటలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో పాత గొడవల నేపథ్యంలో ఒక ఘోర హత్య జరిగింది. 2016లో తలెత్తిన ఆస్తి వివాదం, ఘర్షణను మనసులో పెట్టుకున్న ఖుషీ రామ్ అనే 47 ఏళ్ల వ్యక్తి ప్రతీకార హత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం (సెప్టెంబర్ 26) మార్నింగ్ వాక్‌కు వెళ్లిన లఖపత్ సింగ్ అలియాస్ లఖపత్ కటారియా (56) అనే వ్యక్తిని ఖుషీ రామ్ హత్య చేశాడు. అయితే, ఈ హత్యలో తన మైనర్ కొడుకుని కూడా భాగస్వామ్యం చేసుకున్నాడు. తన కొడుక్కి 18 సంవత్సరాలు నిండడానికి ఒక్క రోజు ముందు, పక్కా ప్రణాళిక ప్రకారం ఈ హత్య చేశాడు. 18 ఏళ్లకు ఒక్క రోజు తక్కువైనా మైనర్ అవుతారు, కాబట్టి, జువైనల్ చట్టాల ప్రయోజనాలు పొందొచ్చనే ఉద్దేశంతో ఈ నేరానికి ప్లాన్ చేసుకున్నారు.
Read Also- Karur stampede FIR: విజయ్‌కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటన ఎఫ్ఐఆర్ లీక్.. వెలుగులోకి షాకింగ్ అంశాలు
ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న తండ్రి ఖుషీ రామ్, అతడి మైనర్ కొడుకుని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన ఖుషీ రామ్ ఔచండి అనే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఒక మైనర్‌కు హత్యలో ప్రమేయం ఉన్నా సరే, జువెనైల్ చట్టాల ప్రయోజనాలు పొందవచ్చనే ఉద్దేశంతో, కొడుకు 18వ పుట్టినరోజుకు ఒక్క రోజు ముందు ఈ నేరాన్ని పకడ్బందీగా అమలు చేశారని సౌత్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) అంకిత్ చౌహాన్ వెల్లడించారు. 2016లో ఆస్తి వివాదం జరిగిందని, ఈ సమయంలో ఖుషీ రామ్‌పై అఖపత్ సింగ్ భౌతిక దాడికి పాల్పడ్డాడని, దాంతో, ఖుషీ రామ్ దాదాపు 9 నెలలపాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. అప్పటి నుంచి ఖుషీ రామ్ పగతో రగలిపోయాడని, ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూశాడని అంకిత్ చౌహాన్ వివరించారు.
Read Also- OG collections: ‘ఓజీ’ నాలుగో రోజు గ్రాస్ ఎంతో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఆ రికార్డులు బ్రేక్..
పథకం ప్రకారం, శుక్రవారం ఉదయం బేగంపూర్‌లోని విజయ మండల్ పార్క్‌లో లఖపత్ సింగ్ మార్నింగ్ వాక్‌కి వెళ్లగా, నిందితులు ఇద్దరూ క్రికెట్ బ్యాట్ కొట్టడంతో పాటు తుపాకితో దాడి చేశారు. తీవ్రగాయాలతో పడిపోయి ఉన్న లఖపత్‌ను వెంటనే ఏయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించినప్పటికీ, అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. అతడి శరీరంలో తుపాకీ గాయాలతో పాటు అనేక తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు వివరించారు.
నేరం జరిగిన ప్రదేశానికి 55 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 650కి పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, సాంకేతిక నిఘా ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. దాడి కోసం ఉపయోగించిన బ్లాక్ కలర్ మోటార్‌సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆ బైక్‌కు అసలు నంబర్ ప్లేట్ తొలగించి వేరే డూప్లికేట్‌ది పెట్టారని వివరించారు. హత్యకు పాల్పడడానికి ముందు రోజు ఖుషీ రామ్ తన కొడుక్కి ప్రణాళికను వివరించాడని అన్నారు. జువెనైల్ చట్టాల ప్రయోజనాలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ ప్లాన్ చేశాడని అన్నారు. దాడికి పాల్పడడానికి ముందు, లఖపత్ రోజువారీ కదలికలను గుర్తించే బాధ్యతను ఖుషీరామ్ తన కొడుక్కి అప్పగించాడని వెల్లడించారు.
నిందితుల కాల్ డేటా రికార్డులు, వారి కదలికలను గుర్తించి ప్రశ్నించగా ఖుషీ రామ్‌పై పోలీసుల అనుమానం బలపడింది. ఇంతకు ముందు కూడా దాడి, బెదిరింపులు వంటి అనేక నేరాల్లో అతడి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తమదైన శైలీలో ప్రశ్నించగా నేరానికి సంబంధించిన అసలు విషయాలు బయటకు వచ్చాయి.