Karur Stampede FIR: తమిళనాడులోని కరూర్ లో టీవీకే వ్యవస్థాపకుడు, స్టార్ హీరో విజయ్ నిర్వహించిన తొక్కిసలాటలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు విజయ్ పై తమిళనాడు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ బయటకు రాగా.. అందులో షాకింగ్ అంశాలు వెలుగుచూశాయి. నటుడు విజయ్ తన రాజకీయ బలప్రదర్శన చూపించే క్రమంలో చోటుచేసుకున్న దుర్ఘటనగా దానిని అభివర్ణించారు.
ఎఫ్ఐఆర్‌లో ఏముందంటే?
కరూర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. విజయ్ సభ ఉదయం 9 గంటల కల్లా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొంత ఆలస్యం కావడంతో టీవీకే వ్యవస్థాపకుడు మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని అంతా భావించారు. అయితే 11 గంటలకే కరూర్ సభా ప్రాంగణం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, టీవీకే కార్యకర్తలు చేరుకున్నారు. కానీ ఆయన.. సాయంత్రం 7 గంటలకు ప్రాంగణం వద్దకు వచ్చారు. విజయ్ కావాలనే సభకు ఆలస్యంగా వచ్చి.. అనవసర అంచనాలు పెంచారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. విజయ్.. బస్సులో సభకు వచ్చే క్రమంలో అనుమతులు లేకపోయినా రోడ్ షో నిర్వహించారని అన్నారు. ఫలితంగా దారిపొడవునా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడినట్లు రాసుకొచ్చారు.
తొక్కిసలాటకు కారణమదే
ఉదయం 11 గంటలకే కరూర్ సభా ప్రాంగణానికి అభిమానులు తరలివచ్చారని.. అయితే వారికి ఆహారం, నీరు అందించే సదుపాయాన్ని కల్పించలేదని పోలీసులు ఎఫ్ఐఆర్ లో రాసుకొచ్చారు. ఈ విషయాన్ని అధికారులు.. విజయ్ తో పాటు టీవీకే పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లగా.. వారు ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. తొక్కిసలాటకు గల ప్రధాన కారణం గురించి కూడా ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. వారి ప్రకారం.. టీవీకే కార్యకర్తలు నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలుకొట్టి అక్కడ ఉన్న ఓ షెడ్డుపైకి ఎక్కారు. షెడ్డు నుంచి విజయ్ ను చూడాలని ప్రయత్నించారు. దీంతో పైకప్పు కూలిపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తోడు క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట చోటుచేసుకుందని ఎఫ్ఐఆర్ లో పోలీసులు వివరించారు.
రాజకీయ వివాదం
కరూర్ దుర్ఘటన అధికార డీఎంకేతో పాటు టీవీకే పార్టీ మధ్య రాజకీయ వివాదానికి దారి తీసింది. డీఎంకే కుట్ర వల్లే ఇలా జరిగిందని టీవీకే పార్టీ ఆరోపించింది. టీవీకే పార్టీ న్యాయవాది మాట్లాడుతూ.. మద్రాస్ హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. దుర్ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని లేదంటే కేసును సీబీఐకి బదలాయించాలని కోర్టును కోరినట్లు తెలిపారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ ఘటనపై స్పందించారు. కరూర్ ఘటనపై వస్తోన్న అపవాదులు, పుకార్లు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు.
Also Read: World’s Tallest Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. 2 గంటల ప్రయాణం.. ఇకపై 2 నిమిషాల్లోనే!
టీవీకే వర్సెస్ తమిళనాడు పోలీసులు
మరోవైపు తమిళనాడు పోలీసులపై టీవీకే పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. పార్టీ నాయకుడు ఆధవ్ అర్జున్ ఆరోపణల ప్రకారం.. విజయ్ ప్రసంగం మధ్యలో విద్యుత్ నిలిపివేయడంతో భయాందోళన నెలకొంది. గుంపుపైకి రాళ్లు విసిరారని, అంబులెన్సులు, లాఠీచార్జ్ వల్ల హడావిడి పెరిగిందని చెప్పారు. దానికి సరైన బందోబస్తు ను కూడా పోలీసులు ఏర్పాటు చేయలేదని ఆధవ్ ఆరోపించారు. అయితే తమిళనాడు పోలీసులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. విజయ్ సభకు 500 మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. అయితే సుమారు 27,000 మంది హాజరయ్యారని చెప్పారు. క్రౌడ్ అదుపు తప్పడంతోనే తొక్కిసలాట చోటుచేసుకుందని ఏడీజీపీ డేవిడ్ సన్ వివరించారు.