MLC Kavitha: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరులైన వ్యక్తుల కుటుంబాలకు కోటి రూపాయల సాయం అందే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యానించారు. ‘‘ఉద్యమ సమయంలో 12 వందల మంది అమరులయ్యారని మనమే చెప్పాం. కానీ వారందరికీ సాయం చేయలేదు. అమరుల కుటుంబాలకు కోటి సాయం అందే వరకు పోరాటం చేస్తాం. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం, రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలి. ఆ భూమి ఇచ్చేవరకు ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమిని మేమే ఆక్రమించి ఉద్యమకారులకు పట్టా రాసి ఇస్తున్నాం’’ అని కవిత అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతన్‌కల్‌లో శనివారం నాడు ఆమె పర్యటించారు. తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కృష్ణవేణి, సీనియర్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు.
సూర్యాపేట పేరులో సూర్యుడు
‘‘సూర్యాపేట పేరులోనే సూర్యుడు ఉన్నాడు. మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, మారోజు వీరన్న లాంటి మహనీయులను కన్న జిల్లా ఇది. వాళ్ల స్ఫూర్తితో మేము ప్రజల కోసం పోరాటం చేస్తాం. సమాజంలోని అట్టడుగు వారి కోసం, మహిళలు, యువత కోసం మేము ఫైట్ చేస్తాం. ఆడబిడ్డలంటే నాకు కొంచెం పక్షపాతం ఎక్కువ. వారికి విద్య, వైద్య సదుపాయాలు బాగుండాలని నేను కోరుకుంటా. అందుకే ప్రతి జిల్లాలో విద్య, వైద్య వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నా. ముఖ్యంగా ప్రసూతి హాస్పిటల్‌లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడుగుతున్నాను. నాకు మీ దీవెనలు కావాలి. మీ దీవెనలు ఉంటే తెలంగాణ అంత బాగున్నట్టే. తెలంగాణ కోసం ఉద్యమ కారులు దుగ్యాల రవీందర్ రావు ఎంతో కొట్లాడారు. సూర్యాపేట జిల్లాకు రాగానే నాలో ఎంతో స్ఫూర్తి వచ్చింది. మీ స్ఫూర్తిని తీసుకొని వెళ్తున్నా. ఇంతటి చైతన్యవంతమైన ప్రజలకు కూడా నాయకులు పనిచేయటం లేదు. నూతన్‌కల్లు ప్రజలు చెప్పిన అన్ని సమస్యలపై జాగృతి పోరాటం చేస్తుంది. ఇంత ఎండలో కూడా నాకు ఘనస్వాగతం చెప్పిన ఇక్కడి ప్రజలకు ధన్యవాదాలు’’ అని కవిత పేర్కొన్నారు.
Read Also- Doctors Recruitment: గుడ్‌న్యూస్… త్వరలోనే డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?
చాలాచోట్ల పాడుబడిన కాల్వలు
‘‘జనం బాటలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. చాలా చోట్ల పాడుబడిన కాల్వలు దర్శనమిస్తున్నాయి. 100 పడకల హాస్పిటల్, రుద్రమ చెరువు బాగు చేస్తామని ఇచ్చిన మాటలు ప్రభుత్వాలు నిలబెట్టుకోలేదు. తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్ ను 2018 నుంచి కడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారాక మళ్లీ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో నాలుగేళ్లు, ఈ ప్రభుత్వంలో రెండేళ్లుగా హాస్పిటల్ కడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 30 పడకల హాస్పిటల్‌కు మూడున్నర లక్షల మంది వస్తున్నారని ఇక్కడ సిబ్బంది చెబుతున్నారు. సరైన వసతులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ హాస్పిటల్‌కు రావటం లేదు. దీంతో నెలకు ఇక్కడ రెండు డెలివరీలు మాత్రమే అవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేట్‌కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయి. మనకు ప్రధానంగా కావాల్సింది విద్య, వైద్యమే కదా?. హాస్పిటల్ నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నిస్తే బిల్లులు రావటం లేదని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. విద్య, వైద్యం మీద కాకుండా ఈ ప్రభుత్వం దేని మీద ఖర్చు చేస్తుంది’’ అని అన్నారు.
ఓట్ల కోసం రాలేదు
‘‘పెన్షన్లు పెంచుతాం, ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్, రైతు బంధు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీల్లో ఏదీ నెరవేర్చలేదు. మనం పిడికిలెత్తి గట్టిగా నిలదీయకపోవటంతోనే ప్రభుత్వం హామీలు విస్మరిస్తోంది. ఇప్పుడు ఓట్లు లేవు. నేను ఓట్లు అడగటానికి కూడా రాలేదు. గత 10, 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి చేయిస్తున్నాం. ప్రజలంటే ఓట్లు వేసే మెషిన్లు అని నాయకులు అనుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలకు అవసరాలుంటాయి. వాటిని తీర్చాలన్న సోయి నాయకులకు లేకుండా పోయింది. రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి పోయి, కొత్త పంథా రావాలి’’ అని కవిత పేర్కొన్నారు.
Read Also- Sudheer Reddy Arrest: హైదరాబాద్‌లో ఏపీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్.. గంజాయి పాజిటివ్

