POK protests: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (POK protests) అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ముజఫరాబాద్‌లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉధృతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రాథమిక హక్కులు అమలు చేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ మద్దతున్న ముస్లిం కాన్ఫరెన్స్‌కు చెందిన వ్యక్తులు మూకుమ్మడిగా ఆందోళనకారులపై దాడికి తెగబడ్డారు. సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను పాక్ న్యూస్ ఛానళ్లు ప్రసారం చేశాయి. అనేక వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ముజఫరాబాద్ వీధుల్లో నెలకొన్న అరాచక పరిస్థితులు ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపించాయి.
కొందరు వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరపడం వీడియోల్లో కనిపించింది. కొందరు కాల్పులకు పాల్పడుతుండగా, మరికొందరు జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ కనిపించారు. కార్లపైకి ఎక్కుతూ నిరసనలు తెలిపారు. మరొక వీడియోలో, ఓ ఆందోళనకారుడు గాల్లోకి కాల్పులు జరుపుతూ కనిపించాడు.
Read Also- Crime News: చికెన్ కూర కావాలని అడిగినందుకు.. 7 ఏళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తల్లి
కాగా, గత 24 గంటలుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రాథమిక హక్కుల నిరాకరణకు వ్యతిరేకంగా అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో తీవ్రంగా నిరసనలుగా జరుగుతున్నాయి. ఈ నిరసనల కారణంగా గత కొన్ని రోజులుగా మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు అన్నీ పూర్తిగా మూతపడ్డాయి. రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. కాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రాథమిక హక్కులను డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు మొత్తం 38 డిమాండ్లు చేస్తున్నారు. పాకిస్థాన్‌లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్‌గా ఉంది. ప్రభుత్వంలో ప్రజా ప్రాతినిథ్యాన్ని దెబ్బతీస్తోందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Read Also- Maa Mundeshwari Temple: దేశంలోనే వింతైన ఆలయం.. మేకను బలిస్తారు కానీ.. ఒక్క చుక్క రక్తం కారదు!
గత 70 ఏళ్లుగా తమకు నిరాకరించిన ప్రాథమిక హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, హక్కులు ఇవ్వండి లేదా ప్రజల ఆగ్రహానికి సిద్ధంగా ఉండాలంటూ అవామీ యాక్షన్ కమిటీ (AAC) నేత షౌకత్ నవాజ్ మిర్ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనలు ప్లాన్-ఏ అని, ఇకపై ప్రజలు సహించబోరని అన్నారు. అధికారుల పట్ల గట్టిగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారని, ఆందోళనల ద్వారా ఈ సందేశాన్ని ఇచ్చామని చెప్పారు. తమ మిగతా బ్యాకప్ ప్లాన్‌లు ఉన్నాయని, చివరిదైన ప్లాన్-డీ చాలా తీవ్రమైనదని పాక్ ప్రభుత్వాన్ని సౌకత్ నవాజ్ హెచ్చరించారు.
ఈ ఆందోళనలను అణచివేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం బల ప్రదర్శనకు దిగింది. మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్ పట్టణాల్లో భారీగా ఆయుధాలతో బలగాలు పెట్రోలింగ్ నిర్వహించాయని పాక్ మీడియా సంస్థ ‘డాన్’ పేర్కొంది. పంజాబ్ రాష్ట్రం నుంచి వేలాదిమంది సైనికులను పంపించినట్టు పేర్కొంది. కాగా, ఇస్లామాబాద్ నుంచి అదనంగా 1,000 మంది బలగాలను పీవోకే పంపించినట్టు తెలుస్తోంది. పాక్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ వినియోగంపై కూడా ఆంక్షలు విధించింది.