Maa Mundeshwari Temple: సాధారణంగా అమ్మవారి ఆలయాల్లో మేకలు, కోళ్లు బలిస్తుంటారు. కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆమె సమక్షంలో మేక, కోళ్ల మెడలు కోయడం ద్వారా బలిచ్చే ప్రక్రియను పూర్తి చేస్తుంటారు. దీనిని చాలమంది చూసే ఉంటారు. కానీ బిహార్ లో ఓ అరుదైన ఆలయం ఉంది. అక్కడ మేకలను బలిస్తారు కానీ.. చుక్క నెత్తురు కారదు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.
మేకను ఎలా బలి ఇస్తారంటే?
బిహార్ కైమూర్ జిల్లాలోని పురాతన మా ముండేశ్వరి దేవాలయం అరుదైన జంతు బలులకు ప్రసిద్ధి చెందింది. భగవాన్‌పూర్ బ్లాక్‌లోని పవారా కొండపై అష్టభుజాకారంలో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ఇక్కడి మా ముండేశ్వరి అమ్మవారు.. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంలా ప్రసిద్ధి చెందారు. అలా కోరికలు తీరిన భక్తులు.. మేకలను దేవాలయానికి తీసుకొస్తారు. బలి సమయంలో మేకను అమ్మవారి ముందు ఉంచగానే అది ఆశ్చర్యకరంగా మూర్చపోతుంది. దీంతో పూజారులు ఆ మేకపై అంక్షితలు, పూలు చల్లుతారు. ఆపై మెడలో పూలతో తయారు చేసిన హారం లాంటి దండను వేస్తారు. ఆ దండ వేయగానే మేకలో ఒక్కసారిగా కదలిక వస్తుంది. అప్పుడు ఆ మేకను అమ్మవారికి సమర్పించినట్లుగా భావించి.. దానిని భక్తులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు.
క్రీ.పూ. 625 నాటి ఆలయం
దేశం నలుమూలల నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రుల సమయంలో మా ముండేశ్వరి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోతుంటుంది. దేవాలయ పూజారి మున్నా ద్వివేది మాట్లాడుతూ ‘ఈ దేవాలయం క్రీ.పూ. 625 సంవత్సరంలో నిర్మితమైంది. ఇక్కడ ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. కోరిక నెరవేరితే భక్తులు బియ్యం, పూలతో రక్తరహిత బలి ఇస్తారు’ అని తెలిపారు.
Also Read: Crime News: చికెన్ కూర కావాలని అడిగినందుకు.. 7 ఏళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తల్లి
భక్తులు ఏమంటున్నారంటే?
రాంఘఢ్ నుండి వచ్చిన ఒక భక్తుడు మాట్లాడుతూ ‘నేను అమ్మవారిని ఒక కోరిక కోరుకున్నాను. అది నెరవేరడంతో మేకను తీసుకొచ్చాను. ఇకపై కూడా అమ్మవారి దర్శనానికి తప్పకుండా వస్తాను’ అని చెప్పారు. మరొక భక్తుడు మాట్లాడుతూ తాము ఏటా ఈ ఆలయాన్ని దర్శించుకుంటామని చెప్పారు. ఇక్కడకు వచ్చి ఏదైనా కోరిక కోరితే వెంటనే నెరవేరుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దసరా నవరాత్రుల సందర్భంగా మా ముండేశ్వరి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు సైతం ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో 25 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు దేవాలయ అధికారులు కృష్ణగోపాల్, అంకితా శేఖర్ తెలిపారు.