Crime News: మహరాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. ఏడేళ్ల కుమారుడ్ని కన్న తల్లే అతి దారుణంగా కొట్టి చంపింది. కుమారుడు చికెన్ కూర అడగటం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. 10 ఏళ్ల కుమార్తెను సైతం ఆమె తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించారు.
అసలేం జరిగిందంటే?
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా ధన్సర్ గ్రామంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి పల్లవి తన ఇద్దరు పిల్లలను చపాతీ చేసే కర్రతో దాడి చేసింది. దీని వల్ల కుమారుడు చిన్మాయ్ తలకు తీవ్రగాయమైంది. అయినప్పటికీ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆమె ప్రయత్నించలేదు. దీంతో చిన్మయ్ తీవ్ర రక్త స్రావంతో ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
కప్పిపుచ్చే ప్రయత్నం
7 ఏళ్ల కుమారుడు మరణానికి గల కారణాలను పల్లవి దాచే ప్రయత్నం చేసింది. తన బిడ్డ జాండిస్ వల్ల చనిపోయాడని చుట్టు పక్కల వారిని నమ్మించే యత్నం చేసింది. అయితే బిడ్డను ఎవరూ చూడకుండా పూర్తిగా వస్త్రాలతో కప్పి ఉంచడంతో స్థానికులకు అనుమానం కలిగింది. ఇంట్లోకి వెళ్లి వస్త్రాన్ని తొలగించి చూడగా.. బాలుడి ముఖం, ఛాతీ, వెన్నుపై గాయాలు కనిపించాయి. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: Karur stampede FIR: విజయ్‌కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటన ఎఫ్ఐఆర్ లీక్.. వెలుగులోకి షాకింగ్ అంశాలు
భర్తకు దూరంగా.. పిల్లలతో
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే పల్లవిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ యతీష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. బాలుడి మరణంపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. పల్లవి తన భర్తతో విడిపోయి పిల్లలతో పాటు ఇద్దరు అక్కచెల్లెళ్లతో కలిసి జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలపై దాడి చేసినట్లు పల్లవి కూడా అంగీకరించిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. చికెన్ కూర కావాలని పిల్లలు ఇద్దరు మారం చేయడంతో సహించలేక ఆమె ఈ విధంగా దాడి చేసినట్లు వివరించారు.