ICC Hearing: ఆసియా కప్-2025లో భాగంగా భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగిన సెప్టెంబర్ 21న జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పలువురు పాక్ ఆటగాళ్ల ప్రవర్తన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హారిస్ రౌఫ్ భారత అభిమానులను రెచ్చగొట్టేలా భారత్‌కు చెందిన 6 యుద్ధ విమానాలను పాక్ కూల్చివేసిందంటూ హావభావాలు ప్రదర్శించాడు. ఇక, అర్ధ సెంచరీ సాధించిన ఫర్హాన్ ‘గన్ సెలబ్రేషన్’ చేసుకున్నాడు. వీరిద్దరై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. దీంతో, వీరిద్దరి విచారణ (ICC Hearing) శుక్రవారం ముగిసింది.
పాక్ ప్లేయర్ల వివరణ ఇదే
విచారణ సందర్భంగా మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్‌కు హారిస్ రౌఫ్ వివరణ ఇచ్చాడు. ‘6-0’ అంటే అర్థం ఏమీ లేదని, అది సంజ్ఞను తప్పుగా ఎలా భావిస్తారని అతడు ప్రశ్నించినట్టు సమాచారం. ఇక హాఫ్ సెంచరీ తర్వాత గన్ సెలబ్రేషన్ చేసుకోవడంపై ఫర్హాన్ స్పందిస్తూ, ఈ సెలబ్రేషన్ విషయంలో తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఐసీసీ ముందు వాదించాడు. ఇది తమ తెగ పద్ధతి అని సమర్థించుకున్నాడు. ‘‘నేను పఠాన్ కమ్యూనిటీకి చెందినవాడిని. మేము మా దేశంలో సెలబ్రేషన్లలో గన్‌ఫైరింగ్ చేస్తుంటాం. ఇది మా పఖ్తూన్ తెగకు చెందిన సంప్రదాయ పద్ధతి’’ అని ఫర్హాన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. గతంలో భారత్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి సెలబ్రేషన్ చేసుకున్నాడని ఈ సందర్భంగా ఫర్హాన్ గుర్తుచేసినట్టు తెలిసింది.
Read Also- Dussehra Holidays 2025: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ప్రకటన.. ఎన్ని రోజులంటే?
జరిమానా విధించే అవకాశం
హారిస్ రౌఫ్, ఫర్హాన్‌లపై ఐసీసీ భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. 50 శాతం నుంచి 100 శాతం వరకు మ్యాచ్ ఫీజులో కోత విధించే ఛాన్స్ ఉంది. ఈ జరిమానాలను త్వరలోనే విధించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పాకిస్థాన్ ఆటగాళ్ల ప్రవర్తనపై భారత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అటు పాకిస్థాన్ కూడా సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
రౌఫ్ వివాదాస్పద ప్రవర్తన
ఆసియా కప్-2025లో పేసర్ హారిస్ రౌఫ్ వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. సెప్టెంబర్ 21న భారత్-పాక్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఇండియన్స్ ఫ్యాన్స్ ‘కోహ్లీ, కోహ్లీ’ అంటూ నినాదాలు చేశారు. టీ20 వరల్డ్ కప్-2022లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా హారిస్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ సిక్సర్లను గుర్తు చేస్తూ అభిమానులు అతడిని హేళన చేశారు. అభిమానులకు ప్రతిస్పందనగా భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చివేసిందన్నట్టుగా హావభావాలు వ్యక్తం చేశాడు. ఈ చర్య పరోక్షంగా భారత సైనిక బలగాలను అవమానించినట్టు అయింది.
అదే మ్యాచ్‌లో హారిస్ మరో వివాదానికి కూడా తెరతీశాడు. అతడి బౌలింగ్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చక్కటి బౌండరీ బాదాడు. దీంతో, రౌఫ్ అక్కసు వెళ్లగగ్గాడు. భారత ఆటగాళ్లపైకి పదేపదే దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు అసభ్య పదజాలం వాడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ ఇద్దరూ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ చుక్కలు చూపించారు.