Dussehra Holidays 2025: రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (Board of Intermediate Education) భారీ శుభవార్త చెప్పింది. దసరాను పురస్కరించుకొని 9 రోజుల పాటు జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీల వరకూ కళాశాలలకు దసరా హాలీడేస్ మంజూరు చేసింది.
ఒక రోజు ముందే
వాస్తవానికి ఆదివారం (సెప్టెంబర్ 28) నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వాలని బోర్డు భావించింది. అయితే విద్యార్థులు, ఉపాధ్యాయుల ఒత్తిడి నేపథ్యంలో శనివారం నుంచే సెలవులు ప్రకటించింది. తమ ఆదేశాలకు విరుద్దంగా దసరా సెలువుల్లో జూనియర్ కాలేజీలు తెరిస్తే.. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డ్ హెచ్చరించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 6న తిరిగి కళాశాలను తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, మోడల్, వోకేషనల్ కోర్సులు చెప్పే కాలేజీలకు వర్తిస్తాయని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది.
స్కూళ్లకు 13 రోజులుగా..
మరోవైపు తెలంగాణలో ఇప్పటికే స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించారు. ఈనెల 21 నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు మూతపడ్డాయి. 13 రోజుల వరకూ అంటే అక్టోబర్ 3వరకూ ఈ సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 4న తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ తెరుచుకోనున్నాయి. అయితే పండుగ సెలవుల్లో స్కూల్స్ ఓపెన్ చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
Also Read: UP Madrassa: యూపీలో ఘోరం.. 40 మంది బాలికలను.. బాత్రూమ్‌లో బంధించి..
ఏపీలోనూ దసరా సెలవులు
మరోవైపు ఏపీలోనూ స్కూళ్లకు దసరా హాలీడేస్ నడుస్తున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వరకూ ఇవి కొనసాగనున్నాయి. వాస్తవానికి ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి తొలుత దసరా హాలీడేస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దసరా నవరాత్రులు ఈ నెల 22 నుంచే ప్రారంభమైన నేపథ్యంలో రెండ్రోజులు ముందు నుంచే సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు టీచర్లు డిమాండ్ చేశారు. వారి కోరికను మన్నించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. సెలవులను సెప్టెంబర్ 22 నుంచే ఇస్తున్నట్లు ప్రకటించారు.