Jangaon District: చాకలి ఐలమ్మ అణగారిన కులంలో పుట్టింది.. బాంచేన్ దొర నీ కాల్మోక్తుతా అనే పిలుపు నుంచి నీ దొర పెత్తనం ఏందని ఎదురు తిరిగింది. నోటికొచ్చిన పంటను రజాకార్లు దోచుకుపోతుంటే కొడవలి చేతపట్టి ఎదిరించింది. ముష్కరుల నుంచి పంటను కాపాడుకుని కుటుంబాన్ని సాదుకుంది.. సంఘం నాయకులను కాపాడింది.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగుతున్న పోరాటాన్ని రైతాంగ పోరాటంగా మార్చి తెలంగాణ సాయుధ పోరాట గతినే మార్చిన వీరనారి ఆమే. ఆమే నేటి తరం మహిళకు ఆదర్శం. మలి దశ తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి. ఆమే తెగువ, పోరాటం చరిత్ర గతినే మార్చిందని జనగామ జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్ పి.పింకేష్ కుమార్ అభిప్రాయపడ్డారు.
Also Read: OG Movie Ticket Hike: ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై.. తనకు తెలియకుండానే జీవో ఇచ్చారని మంత్రి ఫైర్
కలెక్టరెట్ లో బీసి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఐలమ్మ చిత్ర పటానికి కలెక్టర్ పింకేష్ కుమార్ పూలమాల వేసి ఘన నివాళీ అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు దేశ స్వాతంత్ర్యం సిద్దించినా తెలంగాణ ప్రాంతానికి మాత్రం స్వాతంత్ర్య ఫలాలు దక్కలేదన్నారు. తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో, రజాకార్ల ఆగడాలతో బడుగు బలహీన వర్గాల ప్రజలు అణిచవేయబడుతున్న రోజులవి అన్నారు. ఆనాడు పాలకుర్తి ప్రాంత ప్రజలను రజాకార్లు, నిజాం దేశ్‌ముఖ్ హింసిస్తుండేవారని అన్నారు. ఎందరినో యువకులను, అమాయక ప్రజలను హత్యలు చేశారని, మహిళలను మానభంగాలు చేశారని ఆవేధన వ్యక్తం చేశారు.
ఆనాటి ఐలమ్మ పోరాటం ఈనాటి మహిళకు స్పూర్తి
అలాంటి హీనమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వ్యవసాయం చేసుకుంటున్న ఐలమ్మపై పగబట్టిన దేశ్‌ముఖ్ గుండాలు, రజాకారు సైన్యం ఆమే పంటను ఎత్తుకెళ్ళాలని ప్రయత్నిస్తే ఆంధ్రమహాసభ నాయకుల అండతో పంటను కాపాడుకుందని అన్నారు. ఆనాటి ఐలమ్మ పోరాటం ఈనాటి మహిళకు స్పూర్తిదాయకమన్నారు. ఆమేను ప్రతి ఒక్క మహిళ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నేటి యువత అన్యాయాలకు ఎదురుగా నిలిచి గుండె దైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చైతన్యంతో తమ హక్కులను సాధించుకోవాలని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పొంది ఆర్ధికంగా ఎదగాలని అన్నారు. ప్రభుత్వం ఐలమ్మను ఈనాడు ఘనంగా స్మరించుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్ .ఎల్. నరసింహారావు, సహాయ బి.సి.సంక్షేమాధికారి బి.రవీందర్, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈదునూరి మదార్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఎదునూరి నరేష్, డాక్టర్ కల్నల్ బిక్షపతి, జనగామ మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్, దిశ సభ్యులు శ్రీనివాస్, ఆర్టిఏ సభ్యులు అభి గౌడ్, రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఉపేందర్, లింగాల గణపురం మండల రజక సంఘం అధ్యక్షులు రాజు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల బాలరాజు, గీత కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బల్దే వెంకట మల్లయ్య పాల్గొన్నారు.