Crime News: సైదాబాద్ లో సంచలనం సృష్టించిన వృద్ధుని హత్య కేసులో మిస్టరీ వీడింది. హతుని మేనకోడలే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివాదంలో అందరి ముందు తిడుతున్నాడన్న కోపంతోపాటు ఆర్థిక సమస్యల నుంచి బయట పడటానికే నిందితురాలు హత్యకు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. హత్య తరువాత దోచుకున్న వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్(DCP Chaaithnaya Kumar) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కట్రోత్ శివయ్య (70) సైదాబాద్ విష్ణునగర్ నివాసి. అదే ప్రాంతంలో శివయ్య మేనకోడలు నేనావత్ మంగ (48) నివాసముంటోంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం కొత్తగా ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్న శివయ్య అదే విషయాన్ని మంగతో చెప్పాడు.
పని అప్పగిస్తే నిలువునా ముంచాడంటూ..
ఈ నేపథ్యంలో మంగ తనకు తెలిసిన మేస్త్రీ ఉన్నాడని, పని బాగా చేస్తాడని చెప్పి వెంకటేశ్ అనే వ్యక్తిని అతనికి పరిచయం చేసింది. ఇక, వెంకటేశ్ కు 8.25లక్షల రూపాయలు ఇచ్చిన శివయ్య ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టించాడు. అయితే, వెంకటేశ్ చెప్పిన సమయంలోపు నిర్మాణం పనులు పూర్తి చేయలేదు. దాంతో శివయ్య ఆర్థికంగా నష్టపోయాడు. ఈ క్రమంలో కొన్నిరోజుల నుంచి శివయ్య తరచూ మంగతో గొడవ పడుతున్నాడు. నువ్వు చెప్పిన మాటలు నమ్మి వెంకటేశ్ కు పని అప్పగిస్తే నిలువునా ముంచాడంటూ ఆమెను దూషిస్తున్నాడు. శివయ్య కుటుంబ సభ్యులు కూడా జరిగిన నష్టానికి నువ్వే కారణమంటూ మంగను పలుమార్లు తిట్టారు. ఈనెల 14న కూడా గొడవ జరుగగా బస్తీవాసులు అందరి ముందు శివయ్య పరుష పదజాలంతో మంగను దూషించాడు.
Also Read: Thummala Nageswara Rao: ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలకే ప్రథమ ప్రాధాన్యం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
నిజానికి…
వాస్తవానికి భర్త చనిపోయిన తరువాత మంగ తనకు పరిచయం ఉన్న వెంకటేశ్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటేశ్ ఆమె పేరు మీద వాయిదా పద్దతిపై ఓ బైక్ ను కొనుగోలు చేశాడు. కొన్ని నెలలుగా బైక్ ఈఎంఐలు చెల్లించక పోవటంతో ఫైనాన్స్ సంస్థ నుంచి ఒత్తిడి అధికమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మంగ ఆర్థిక సమస్యల నుంచి బయట పడటంతోపాటు కక్షను తీర్చుకోవటానికి శివయ్యను హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈనెల 15న శివయ్య మద్యం సేవించి నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఒంటరిగా పడుకుని ఉండగా తెల్లవారుఝాము సమయంలో అక్కడికి వెళ్లింది. ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. అప్పటికీ చనిపోలేదేమో అన్న అనుమానంతో ప్లాస్టిక్ వైర్ తో ఉరి బిగించింది. శివయ్య మరణించాడని నిర్దారించుకున్న తరువాత అతని చేతులకు ఉన్న వెండి కడియాలు, నడుముకున్న వెండి గొలుసును తీసుకుని పరారైంది. కాగా, శివయ్య పెద్ద కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ సీఐ చంద్రమోహన్ కేసులు నమోదు చేశారు. అదనపు డీసీపీ శ్రీకాంత్, ఏసీపీ వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ జ్ఞానేశ్వర్ తో కలిసి విచారణ చేపట్టారు. మంగనే హత్యకు పాల్పడిందని నిర్ధారించుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Kishan Reddy: కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందాల్సిందే.. మంత్రి ఆదేశం