Rs 100 bribery case: ‘న్యాయం ఆలస్యం కావొచ్చేమో కానీ, తిరస్కరణకు గురికాదు’ భారత న్యాయవ్యవస్థ మౌలిక సూత్రాన్ని చాటిచెప్పే భావన ఇది. ఈ మాటను నిజం చేస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు శుక్రవారం అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. రూ.100 లంచం కేసులో (Rs 100 bribery case) ఏకంగా 39 సంవత్సరాలపాటు న్యాయపోరాటం చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నిర్దోషి అని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో మధ్యప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థలో బిల్లింగ్ అసిస్టెంట్‌గా పనిచేసిన జగేశ్వర్ ప్రసాద్ అవస్థి అనే వ్యక్తికి సుదీర్ఘకాలం తర్వాత కేసు నుంచి విముక్తి లభించింది.
కేసు పూర్వాపరాలు ఇవే
ఈ కేసు 1986లో మొదలైంది. బిల్లింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో జగేశ్వర్ ప్రసాద్ అవస్థిపై లంచం ఆరోపణలు వచ్చాయి. పెండింగ్ బకాయిలను సెటిల్ చేయడానికి రూ.100 లంచం డిమాండ్ చేశారంటూ అశోక్ కుమార్ వర్మ అనే ఓ ఉద్యోగి ఆరోపించారు. అతడి ఫిర్యాదు ఆధారంగా, నాటి లోకాయుక్త అధికారులు రంగంలోకి దిగారు. ఫీనాల్‌ఫ్తేలీన్ (పింక్ ఇండికేటర్) పూత పూసిన నోట్లు ఉపయోగించి ఒక వల ట్రాప్ వేశారు. ఈ వలలో పడిన అవస్థి నగదుతో పట్టుబడ్డాడు. ఈ కేసును విచారించిన దిగువ స్థాయి కోర్టు 2004లో అతడికి ఒక ఏడాది జైలు శిక్ష విధించింది. దీంతో, ఆయన హైకోర్టులో సవాలు చేశాడు. సుదీర్ఘకాలంపాటు సాగిన ఈ కేసు విచారణలో శుక్రవారం ఛత్తీస్‌గఢ్ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లొసుగులు ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.
Read Also- EPFO Passbook Lite: పీఎఫ్ విత్‌డ్రా ఇక చాలా సులభం .. కొత్త ఫీచర్ వచ్చేసింది
అవస్థి లంచం డిమాండ్ చేసినట్టుగా స్వతంత్ర సాక్ష్యం ఏమీలేదని, డబ్బులు అడిగిన విషయాన్ని నిరూపించేందుకు స్వతంత్ర సాక్షి కూడా ఎవరూ లేరని హైకోర్టు పేర్కొంది. షాడో విట్‌నెస్ (గమనించడానికి నియమించిన వ్యక్తి) తాను సంభాషణను వినలేదని, డబ్బులు తీసుకోవడం చూడలేదని విచారణలో తెలిపాడని న్యాయస్థానం పేర్కొంది. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు చాలా దూరంలో ఉన్నారని, 20–25 గజాల దూరంలో ఉండటంతో అసలు లంచం తీసుకున్నారా?, లేదా? అనేది వారికి తెలియదని పేర్కొంది. లంచంగా తీసుకున్న సొమ్ములో ఎన్ని నోట్లు ఉన్నాయన్నది కూడా స్పష్టంగా లేదని వివరించింది. ఒకే వంద నోటు ఇచ్చారా?, లేక రెండు యాబైలు ఇచ్చారా? అనే స్పష్టంగా లేదని విమర్శించింది. అందుకే, అవస్థిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్టు న్యాయస్థానం వివరించింది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జడ్జి బిభూ దత్త గురు ఈ మేరకు తీర్పునిచ్చారు. గతంలో దిగువస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తోసిపుచ్చారు. సాక్ష్యాలలో లోపం కారణంగా అవస్థిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు.
Read Also- Chevella Road Widening: చెట్ల పరిరక్షణ పేరుతో.. ప్రమాదకరమైన రోడ్డు స్థానికుల కష్టాలు.. ఎక్కడంటే?
చివరికి నిర్దోషిగా అవస్థి
జగేశ్వర్ ప్రసాద్ అవస్థి తన వాదనలో కీలక పాయింట్స్ లేవనెత్తారు. లంచం తీసుకున్నానంటూ ఆరోపణలు వచ్చిన సమయంలో, అసలు తనకు బిల్లులు పాస్ చేసే అధికారం లేదని, ఆ ఘటన జరిగిన ఒక నెల తర్వాత తాను ఆ అధికారాన్ని పొందానని కోర్టుకు తెలిపాడు. అవస్థి వాదనను హైకోర్టు సమ్మతించింది. లంచం డిమాండ్ చేయడం, లేదా ఉద్దేశం నిరూపించకుండా, కేవలం నోట్లను స్వాధీనం చేసుకోవడం ద్వారా లంచం నేరాన్ని నిరూపించలేమని న్యాయస్థానం స్పష్టంగా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయమూర్తి ఉదాహరించారు. ఈ కేసులో ఏర్పాటు చేసిన ట్రాప్ విఫలమైందని, అవస్థి దోషి అంటూ ఇచ్చిన తీర్పు నిలబడదని జడ్జి స్పందించారు. మొత్తానికి, దాదాపు నలభై సంవత్సరాల తర్వాత, లంచం ఆరోపణల నుంచి జగేశ్వర్ ప్రసాద్ అవస్థి బయటపడ్డారు.