Oil Kumar: వాహనాలు నడిపేందుకు ఉపయోగించే ఇంజిన్ ఆయిల్‌ను (Oil Kumar) మనుషులు తాగడం చాలా హానికరం. కానీ, కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి అసాధారణంగా వాడిన ఇంజిన్ ఆయిల్‌ను తన ఆహారపు అలవాట్లలో భాగంగా మార్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. శివమొగ్గ జిల్లాకు చెందిన ఆ వ్యక్తిని అందరూ ‘ఆయిల్ కుమార్’ అని పిలుస్తున్నారు. ప్రతిరోజూ టీతో పాటు 7 నుంచి 8 లీటర్ల వరకు ఇంజిన్ ఆయిల్ తాగుతాడని తెలిసినవారు అంటున్నారు. వైరల్‌గా మారిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో కుమార్ చుట్టూ ఉన్నవారు ఆహారాన్ని అందించగా అతడు తిరస్కరించాడు. బాటిల్‌లో ఉన్న నల్ల ఇంజిన్ ఆయిల్ బాటిల్‌ను నేరుగా నోటిలో పెట్టుకొని తాగుతుండడం వీడియోలో కనిపించింది. గత 33 ఏళ్లుగా ఈ అసాధారణమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడని వీడియోలో పేర్కొన్నారు.
శివమొగ్గకు చెందిన ఆయిల్ కుమార్ గత 33 ఏళ్లుగా అన్నం, చపాతీలకు బదులుగా ప్రతిరోజూ 7–8 లీటర్ల వాడిన ఇంజిన్ ఆయిల్ (యూజుడ్), టీ తాగుతూ జీవిస్తున్నాడని వీడియో క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఆహారం తినకుండా బతకడం ద్వారా ఆయిల్ కుమార్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడంటూ క్యాప్షన్‌లో పేర్కొన్నారు. కాగా, ఆయిల్ కుమార్ ఇప్పటివరకు ఎప్పుడూ హాస్పిటల్‌లో చేరిన దాఖలాలు లేవని, పెద్దగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోలేదని సమాచారం. అయ్యప్ప స్వామిపై నమ్మకమే తనను బతికిస్తోందంటూ ఆయిల్ కుమార్ చెబుతున్నట్టు వీడియోలో పేర్కొన్నారు.
Read Also- Dussehra Holidays 2025: విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు.. లోకేశ్ కీలక ప్రకటన
ఇంజిన్ ఆయిల్ చాలా హానికరం
ఇంజిన్ ఆయిల్ మనుషులు తాగడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఉపయోగించిన ఇంజిన్ ఆయిల్‌లో అనేక రకాల హానికరమైన పదార్థాలు ఉంటాయి. అవి మనుషుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఉపయోగించిన ఇంజిన్ ఆయిల్‌లో పాలీసైక్లిక్ అరొమాటిక్ హైడ్రోకార్బన్లు (PAHs) ఉంటాయి. ఇవి ఇంధనం దహన సమయంలో ఏర్పడే కార్సినోజెనిక్ (క్యాన్సర్ కలిగించే) పదార్థాలు. దీనిని క్యాన్సర్ ముప్పుగా పరిగణించారు. హెవీ మెటల్స్ కూడా ఈ ఆయిల్‌లో ఉంటాయి. ఐరన్, అల్యూమినియం, కాపర్, లెడ్ మొదలైనవి ఉంటాయి. ఇవి శరీరంలో చేరితే కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతాయి. ఆయిల్‌లో ఉండే ఇతర మలినాలు కూడా ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాలేయం, నరాల వ్యవస్థకు హానికరమని అంటున్నారు. వాడేసిన ఆయిల్‌లో ఉండే ఇతర మలినాలు నోటికి తగిలినా లేదా, పేగులలోకి వెళ్లినా, చిన్న మొత్తంలో పీల్చుకున్నా వాంతులు, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. అదే ఎక్కువ తాగితే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ (Aspiration Pneumonia) వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.