MP Etela Rajender: ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పెద్ద పదవి వచ్చినా అది గడ్డిపోచతో సమానమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు. ఉప్పల్.. కాప్రాలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలెక్క విసిరిపడేశామని తెలిపారు. సాధారణంగా 20 ఏండ్లలో 4 సార్లు ఎమ్మెల్యేలు అవుతారని, కానీ తాను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యానని గుర్తుచేశారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం రాజీనామాల మీద రాజీనామాలు చేశామన్నారు. అభివృద్ధి కావాలా? ఆత్మగౌరవం కావాలా అంటే ముందు కోరుకొనేది ఆత్మగౌరవం, స్వయం పాలన అని, కానీ గతంలో అది లేదన్నారు. తమకు ఆత్మగౌరవం, స్వయంపాలన కావాలని కొట్లాడినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు అందరూ అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఎంతోమంది త్యాగఫలం అని మర్చిపోవద్దన్నారు.
ఎక్కువ పర్యటనలు చేస్తున్న ఎంపీగా..
పిల్లలకు దేశభక్తి నేర్పించాలని, దేశభక్తి, కమిట్ మెంట్ లేకుంటే కష్టమవుతుందన్నారు. పక్క దేశాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని ఈటల వివరించారు. పిల్లలకు వారస్వత్వంగా అందిచాల్సింది కేవలం ఆస్తులు మాత్రమే కాదని, విలువలు, సంప్రదాయాలు వారసత్వంగా అందించాలని రాజేందర్ సూచించారు. ఈరోజుల్లో వస్తున్న వార్తలు కలచివేస్తున్నాయని, కన్న తల్లిదండ్రులను, కడుపున పుట్టిన పిల్లలను, సొంత భర్తను చంపుతున్నారన్నారు. వీటి నుంచి కాపాడేది విలువలేనని రాజేందర్ గుర్తుచేశారు. ఇదిలా ఉండగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి(MLA Laxma Reeddy) మాట్లాడుతూ.. దేశంలో అతి ఎక్కువ పర్యటనలు చేస్తున్న ఎంపీగా ఈటల రాజేందర్ కు మొదటి స్థానం వస్తుందని కొనియాడారు. ఎంపీ అయిన రోజునుంచి ఆయన ఇంట్లో ఉన్నది లేదని, ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటున్నారన్నారు. అలానే నిధులు కూడా ఇవ్వాలని ఆయన్ను కోరారు. ఈ ప్రాంతంలో రోడ్లు బాగా ధ్వంసమయ్యాయని, బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: CPI: తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం
ఇండ్లపై ఉన్న కరెంట్ వైర్లు
అనంతరం ఎంసీఆర్ హెచ్ ఆర్టీ(MCRHRT)లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం(దిశ)లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తో కలిసి ఈటల పాల్గొన్నారు. ఈ మీటింగులో రాజేందర్ మాట్లాడుతూ.. కేబుల్ వైర్ తగిలి కరెంటు షాక్ కొట్టి చనిపోయారని సిటీలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారని, వాస్తవానికి వాటిని సరిచేయాల్సిందేనని, కానీ ఇంటర్నెట్ రాకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఇంటర్నెట్ రాక విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, దీనికి వెంటనే పరిష్కార మార్గం చూపాలన్నారు. కరెంట్ ఇనుప స్తంభాలు తొలగించాలని, ఇండ్లపై ఉన్న కరెంట్ వైర్లు మార్పించాలని డిమాండ్ చేశారు. చిన్న వర్షం వస్తే చాలు.. మహానగరం ముంపునకు గురవుతోందని, ఇలా అవ్వకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని కోరారు. కొంతమంది అధికారులు జవాబుదారీతనంతో ఉండడం లేదని, ఫోన్లు ఎత్తడం లేదని, అందుబాటులో కూడా ఉండటంలేదని కలెక్టర్ కు సూచించారు.
Also Read: Hyderabad Rains: రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం.. జలమయమైన సిటీ రోడ్లు