Stray Dogs: ప్రేరణ లేకుండానే మనిషిని కొరికే కుక్కలను కట్టడి చేయడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఆదేశాల ప్రకారం.. ఒకసారి కుక్క కారణం లేకుండా మనిషిని కరిస్తే.. దానిని 10 రోజుల పాటు జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచుతారు. అదే కుక్క మరోసారి కొరికితే జీవితాంతం ఆ కేంద్రంలోనే నిర్బంధిస్తారు. అయితే దానిని ఎవరైనా దత్తత తీసుకుని ఇకపై వీధిలో వదలబోమని అఫిడవిట్ ఇస్తే తప్ప ఆ కుక్కను బయటకు అనుమతించకూడదని ప్రభుత్వ ఆదేశించింది.
ప్రభుత్వ ఆదేశాలు
సెప్టెంబర్ 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజాత్ జారీ చేసిన ఈ ఆదేశాలు అన్ని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు పంపబడ్డాయి. వీటిలో ‘ఒక వ్యక్తి వీధికుక్క కొరికిన కారణంగా యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకుంటే ఆ సంఘటనపై దర్యాప్తు జరుగుతుంది. సంబంధిత కుక్కను దగ్గరలోని జంతు జనన నియంత్రణ (Animal Birth Control) కేంద్రానికి తరలిస్తారు’ అని పేర్కొన్నారు.
కరిచిన కుక్కలకు మైక్రో చిప్
డాక్టర్ బిజయ్ అమృత్ రాజ్ (ప్రయాగ్‌రాజ్ మునిసిపల్ కార్పొరేషన్ వెటర్నరీ అధికారి) మాట్లాడుతూ.. ‘సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత ఆ కుక్కను స్టెరిలైజ్ చేస్తారు (అప్పటికీ చేయకపోతే). ఆపై 10 రోజులపాటు గమనిస్తారు. తర్వాత విడిచే ముందు దానికి మైక్రోచిప్ అమర్చుతారు. దానిలో అన్ని వివరాలు ఉంటాయి. అలాగే కుక్క ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది’ అని అన్నారు.
రెండోసారి కొరికితే జీవిత ఖైదు
అదే కుక్క మరోసారి ప్రేరణ లేకుండా మనిషిని కరిస్తే జీవితాంతం ఆ కేంద్రంలోనే ఉంచుతారు. అయితే ప్రేరణ ఉందో లేదో ఎలా తెలుస్తుందన్న ప్రశ్నపై డా. అమృత్ రాజ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘ముగ్గురుతో కూడిన కమిటీ ఏర్పడుతుంది. ఒకరు స్థానిక వెటర్నరీ డాక్టర్, రెండో వ్యక్తి జంతువుల ప్రవర్తనలో అనుభవం ఉన్నవారు, మూడో వ్యక్తి మునిసిపల్ కార్పొరేషన్ నుంచి ఉంటారు. వారు దాడి ప్రేరణ లేకుండా జరిగిందా? లేదా? అని నిర్ధారిస్తారు. ఎవరైనా రాయి విసిరితే దానికి ప్రతిగా కుక్క కొరికితే అది ప్రేరణలేని దాడి కింద పరిగణించబడదు’ అని అన్నారు.
దత్తత తీసుకొని వదిలేస్తే చర్యలు
ఇలాంటి కుక్కలను ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి తన పేరు, చిరునామా మొదలైన వివరాలు ఇచ్చి, కుక్కను మళ్లీ వీధిలో వదలబోమని అఫిడవిట్ సమర్పించాలి. కుక్క మైక్రోచిప్ వివరాలు కూడా నమోదు అవుతాయి. దత్తత తీసుకున్న తర్వాత వీధిలో వదిలేస్తే ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
Also Read: Viral Video: ఇంటి పనిలో గొడవ.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న అత్తా కోడళ్లు.. వీడియో వైరల్
సుప్రీంకోర్టు నేపథ్యం
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాల తర్వాత యూపీ ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. తొలుత సుప్రీంకోర్టు తన తీర్పులో దిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతంలోని అన్ని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లో షెల్టర్ హోమ్స్‌లో ఉంచాలని సూచించింది. అయితే దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం కావడంతో సీజేఐ బెంచ్ ఆదేశాలను సవరించి కుక్కలను స్టెరిలైజ్, వ్యాక్సిన్ చేసి మళ్లీ వాటి అసలు ప్రదేశాల్లో వదిలేయాలని చెప్పింది. రేబిస్ సోకినవి లేదా తీవ్ర ఆగ్రహ స్వభావం ఉన్న కుక్కలు మాత్రం విడిచిపెట్టకూడదని తీర్మానించింది.