Rajasthan Shocker: వివాహేతర సంబంధాలు.. మానవ బంధాలను నాశనం చేస్తున్నాయి. కట్టుకున్న వారితో పాటు కన్నబిడ్డలను సైతం కాటికి పంపేలా ఉసిగొల్పుతున్నాయి. తాజాగా రాజస్థాన్ లోని అజ్మీర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన మూడేళ్ల బిడ్డను బయటకు తీసుకెళ్లి.. సరస్సులో పడేసింది. ఆపై తప్పిపోయినట్లు కట్టుకథ అల్లింది. చివరికి నిజం తెలియడంతో బంధువులతో పాటు పోలీసులు సైతం షాకయ్యారు.
అసలేం జరిగిందంటే?
యూపీలోని వారణాసికి చెందిన అంజలి అలియాస్ ప్రియ.. భర్తకు విడాకులు ఇచ్చి.. రాజస్థాన్ లోని అజ్మీర్ కు వచ్చేసింది. అక్కడే ఓ హోటల్ రిసెప్షనిస్ట్ గా పనిచేస్తూ తోటి ఉద్యోగి ఆల్కేష్ కు దగ్గరైంది. వారిద్దరు సహజీవనం చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే అంజలికి మూడేళ్ల పాప ఉంది. మెుదటి భర్తకు జన్మించిన బిడ్డ కావడంతో పాప విషయంలో ఆల్కేష్ చాలా అయిష్టంగా ఉండేవాడు. తరుచూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు.
బిడ్డ కనిపించలేదని నాటకం
అయితే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంజలి, ఆల్కేష్ ద్విచక్రవాహనంపై వస్తూ.. పహారా కాస్తున్న హెడ్ కానిస్టేబుల్ గోవింద్ శర్మకు కనిపించారు. ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించగా.. అంజలి కంగారు పడుతూ తన బిడ్డ మార్గం మద్యలో అదృశ్యమైందని చెప్పింది. ఎంత వెతికినా కనబడలేదని కన్నీరు పెట్టుకుంది. అది నిజమేనని భావించిన పోలీసులు.. వారు ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.
Also Read: TGSRTC: దసరా, బతుకమ్మ స్పెషల్.. 7754 ప్రత్యేక బస్సులు.. టీజీఎస్ఆర్టీసీ ప్రకటన
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా..
ఈ క్రమంలో అనా సాగర్ సరస్సు వద్ద కుమార్తెను ఒడిలో పెట్టుకొని అంజలి ఉన్న ఫుటేజీని పోలీసులు కనుగొన్నారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆమె ఒంటరిగా బిడ్డతో అక్కడ తిరుగుతూ కనిపించింది. దీంతో బుధవారం ఉదయం సరస్సు వద్ద గాలించగా చిన్నారి మృతదేహం బయటపడింది. తల్లిపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో అంజలిని ప్రశ్నించారు. దీంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తనే కూతుర్ని హత్య చేసి.. సరస్సులో విసిరేసినట్లు అంజలి అంగీరించింది. ప్రియుడి అల్కేష్ తన కూతురు విషయంలో ఇబ్బందిగా ఫీలవుతుండటంతో పాపను చంపేసినట్లు పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అంజలిని అరెస్ట్ చేశారు. ఈ హత్యలో ఆల్కేష్ ప్రత్యక్షంగా పాలు పుంచుకున్నాడా? లేదా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.