Road Accident: ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు బోల్తా పడిన దుర్ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృత్యువాత పడింది. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనాకరంగా ఉన్నట్టు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన సౌమ్యారెడ్డి ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది. ఇన్ఫోసిస్ లోనే పని చేస్తున్న ఝాన్సీ, శృతి, నందకిశోర్, వీరేంద్ర, ప్రణీష్, అరవింద్, సాగర్ కలిసి ఆదివారం ఉదయం యాదాద్రి బోనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపూర్ గ్రామ ప్రాంతంలోని సరళ మైసమ్మ ఆలయానికి ఇన్నోవా కారులో వెళ్లారు.
Also Read: Navjyot Singh death: ఆర్థిక శాఖ సీనియర్ అధికారి మృతికి కారణమైన బీఎండబ్ల్యూ కార్ డ్రైవర్ అరెస్ట్
విపరీతమైన వేగం కారణం
అమ్మవారికి పూజలు చేసిన తరువాత చీకటి పడే వరకు అక్కడే సరదాగా కాలం గడిపారు. ఆ తరువాత తిరుగు ప్రయాణమయ్యారు. బోనగిరి వద్ద ఉన్న10వ నెంబర్ ఎగ్జిట్ ఔటర్ రింగు రోడ్డు పైకి వచ్చి ఘట్ కేసర్ వైపు బయల్దేరారు. అబ్దుల్లాపూర్ మెట్ బలిజగూడ వద్దకు రాగానే విపరీతమైన వేగం కారణంగా అదుపు తప్పిన ఇన్నోవా కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. విషయం తెలియగానే ప్రమాద స్థలానికి వెళ్లిన పోలీసులు గాయపడ్డ అందరినీ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తరువాత వైద్యుల సలహా మేరకు తలకు తీవ్ర గాయాలైన సౌమ్యా రెడ్డి, నందకిశోర్ లను ఉప్పల్ లోని ఓ న్యూరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సౌమ్యా రెడ్డి తుదిశ్వాస వదిలింది. నందకిశోర్ పరిస్థితి ఆందోళనాకరంగా ఉన్నట్టు తెలిసింది.
Also Read: Crime News: ఇదేం దారుణం.. ఇచ్చిన బాకీ తీర్చమని అడిగితే చావబాదారు.. ఎక్కడంటే..?