Sachin on Joe Root: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మొత్తం 200 టెస్టులు ఆడి 15,921 పరుగులు సాధించాడు. అయితే, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ టెస్టుల్లో అత్యద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇదే రీతిలో రీతిలో ఆడితే అగ్రస్థానంలో ఉన్న సచిన్ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రూట్ ఖాతాలో 13,543 పరుగులు ఉన్నాయి. మరో 2,378 పరుగులు సాధిస్తే సచిన్‌ను అధిగమిస్తాడు. రూట్ అత్యద్భుత ఆటతీరుని గుర్తించిన సచిన్ టెండూల్కర్ (Sachin on Joe Root) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
నేను అప్పుడే గుర్తించాను..
జో రూట్‌ని మొదటిసారి చూసినప్పుడు మీకు కలిగిన అభిప్రాయం ఏంటి?, రూట్ 13,000 టెస్టు పరుగుల మైలురాయి అధిగమించాడు, తన మొదటి టెస్టు మ్యాచ్ కూడా భారత్ మీదే ఆడాడు కదా? అని ప్రశ్నించగా, సచిన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ‘‘13,000 పరుగుల మైలురాయిని అధిగమించడం నిజంగా చాలా విజయం. ఇంకా చాలా చక్కగా ఆడుతున్నాడు. 2012లో నాగ్‌పూర్‌లో జో రూట్ తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. భవిష్యత్తు ఇంగ్లాండ్ కెప్టెన్‌ని చూస్తున్నారంటూ ఆ రోజుల్లోనే నా సహచర ఆటగాళ్లతో అన్నాను. అతడు పిచ్‌ను విశ్లేషించే విధానం, స్ట్రైక్‌ను రొటేట్ చేసే శైలి నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే, ఒక గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని అప్పుడే పసిగట్టాను’’ అని సచిన్ గుర్తుచేశారు.
పుజారాపై ప్రశంసలు..
చెతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ ప్రకటనపై కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా స్పందించాడు. పుజారా 15 ఏళ్ల పాటు భారత జట్టుకు అవిశ్రాంతంగా సేవ అందించాడంటూ అభినందలు తెలిపారు. ‘‘నువ్వు నిజంగా జట్టుకు ఒక బలమైన పిల్లర్ లాంటి వాడివి’’ అని ఆయన ప్రత్యేక సందేశం ఇచ్చారు.
Read Also- RTC Conductor: ఏపీ బస్సుల్లో నయా మోసం.. పురుషులకు స్త్రీ శక్తి ఉచిత టికెట్లు.. ఇదేందయ్యా ఇది!
‘‘పుజారా, నువ్వు నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు ఎప్పుడూ నమ్మకంగా అనిపించేది. నువ్వు ఆడిన ప్రతిసారి ప్రశాంతత, ధైర్యం ఇచ్చావు. టెస్టు క్రికెట్ పట్ల నీ ప్రేమ మా అందరికీ స్పష్టంగా కనిపించేది. జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో నీ సహనం, టెక్నిక్, స్థిరత్వం జట్టుకు ఒక పిల్లర్‌గా నిలిచింది’’ అంటూ సచిన్ టెండూల్కర్ మెచ్చుకున్నారు. కాగా, పుజారా టెస్ట్ క్రికెట్ ప్లేయర్. 2010 అక్టోబర్‌లో భారత జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. అయితే, గత రెండేళ్లుగా జట్టులో స్థానం దక్కడం లేదు. అందుకే, రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.
Read Also- Jogulamba Gadwal: ఇంకెన్నాళ్లీ యూరియా కష్టాలు.. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న మహిళలు
పుజారా తన టెస్ట్ కెరీర్‌లో ఎన్నో అద్భుతాలు చేశాడు. 2018-19 బార్డర్-గావాస్కర్ ట్రోఫీలో 1,258 బంతులు ఎదుర్కొని, 74.42 సగటుతో 521 పరుగులు సాధించాడు. ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో భారత్ 19/3తో పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు, పుజారా తన తొలి టెస్టు సెంచరీని ఆస్ట్రేలియాలో సాధించాడు. అద్భుత ఆట తీరుతో జట్టుని కాపాడాడు. ఆ సిరీస్‌ను భారత్ 2-1 గెలుచుకుందని, పుజారా లేకుంటే అది సాధ్యపడేది కాదని సచిన్ టెండూల్కర్ గుర్తు చేశాడు. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు అంటూ మెచ్చుకున్నాడు. ‘‘పుజారా, నీ జీవితంలో తదుపరి అధ్యాయానికి శుభాకాంక్షలు. నీ రెండో ఇన్నింగ్స్‌ను ఆనందంగా ఆస్వాదించు!’’ అని సచిన్ తన సందేశాన్ని ఇచ్చాడు.