RTC Conductor: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి ఫ్రీ బస్సు ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఫలితంగా బస్సు ఎక్కిన స్త్రీల నుంచి ఎలాంటి నగదు తీసుకోకుండా వారికి జీరో టికెట్ ను బస్సులో అందజేస్తున్నారు. అయితే కొందరు కండక్టర్లు జీరో టికెట్ విధానాన్ని ఉపయోగించుకొని చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ గోదావరి జిల్లాలో బస్సు ఎక్కిన ఒక మగ వ్యక్తికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. తాడేపల్లి గూడెం నుండి భీమవరం వెళ్లేందుకు ఆరేటి సురేష్ అనే వ్యక్తి బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో కండక్టర్ దగ్గరకు రావడంతో టికెట్ ఇవ్వమని డబ్బులు ఇచ్చాడు. అయితే ఆ డబ్బు తీసుకొని స్త్రీలకు ఇచ్చే జీరో టికెట్ ను కండక్టర్ అందజేశాడు. దీంతో సురేష్ ఒక్కసారిగా షాకయ్యాడు. తనకు ఉచిత టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించగా.. కండెక్టర్ వెంటనే ఆ టికెట్ ను లాక్కుకున్నాడు. తప్పయిందని ఒప్పుకొని.. మరో టికెట్ అందజేశాడు. కాగా స్త్రీ శక్తి పథకం.. కండక్టర్ల చేతి వాటం కారణంగా తప్పు దారి పడుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: Viral News: బట్టలతో పనిలేని వింత యాత్ర.. షిప్‌లో 11 రోజుల పాటు.. నూలు పోగు లేకుండా..!
6 రోజుల్లోనే 65 లక్షల మంది
ఇదిలా ఉంటే స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే పథకాన్ని ప్రారంభించిన తొలి 6 రోజుల్లోనే బస్సుల్లో 65 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు ప్రభుత్వం తెలిపింది. వాటికి సంబంధించి రూ.25 కోట్లను ప్రభుత్వం.. రీయింబర్స్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Also Read: Pradhan Mantri Mudra Yojana: వ్యాపారం చేయాలని ఉందా? ఇలా చేస్తే ఖాతాలోకి రూ.20 లక్షలు!
పథకంపై వస్తోన్న ఆరోపణలు..
స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఆర్టీసీకి ఏటా రూ.1,942 కోట్లు (నెలకు రూ.162 కోట్లు) నష్టం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే బలహీనంగా ఉన్న నేపథ్యంలో స్త్రీ శక్తి పేరిట ప్రభుత్వం మరింత భారాన్ని నెత్తిన వేసుకోవడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఫ్రీ బస్సు కారణంగా తమ ఆదాయం 50 శాతం మేర పడిపోయినట్లు ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
