Viral News: సాధారణంగా క్రూయిజ్ షిప్ లో ప్రయాణం అనగానే.. ఎగిసిపడే సముద్ర అలలు, అందమైన బీచ్ లు, లగ్జరీ ఫుడ్ గుర్తుకు వస్తాయి. కానీ అమెరికాలో జరిగే ఓ క్రూయిజ్ షిప్ యాత్రలో వీటితో పాటు ఎక్కడాలేని మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ షిప్ లో ప్రయాణించదలిచిన వారు బట్టలు ధరించడం నిషేధం. ప్రతీ ఏటా ఫిబ్రవరిలో ఈ బోట్ యాత్ర ప్రారంభమవుతుంది. బట్టలు లేకుండా ప్రయాణాన్ని ఇష్టపడే వారికి ఇదొక సదావకాశమని షిప్ నిర్వాహకులు చెబుతుంటారు.
ఉద్దేశం ఇదే..!
ఈ క్రూయిజ్ నౌక పర్యటనను అమెరికన్ సంస్థ బేర్ నెసెసిటీస్ (Bare Necessities) నిర్వహిస్తోంది. ఒక లగ్జరీ నార్వేజియన్ క్రూయిజ్ (luxury Norwegian Cruise) లైన్ నౌక ఈ విచిత్రమైన బట్టలు లేని ప్రయాణానికి వేదికగా నిలుస్తోంది. ఈ బోటు ఫ్లోరిడాలోని మియామీ తీరం నుంచి కరీబియన్ దీవుల మీదుగ 11 రోజుల పాటు ఈ షిప్ ప్రయాణిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ‘ఈ క్రూయిజ్ ప్రయాణాన్ని అశ్లీలతను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో నిర్వహించడం లేదు. ఇది సౌకర్యం, ఆత్మవిశ్వాసం, సహజత్వం గురించి నిర్వహిస్తున్నాం’ అని నిర్వాహకులు చెబుతున్నారు.
ఎప్పుడు? ఎక్కడ?
2026 ఫిబ్రవరి 9 నుంచి 20 వరకు అమెరికాలోని మియామీ తీరం నుంచి ఈ క్రూయిజ్ షిప్ ప్రయాణం ప్రారంభమవుతుంది. అంటే వాలెంటైన్స్ డే, ఫ్యాట్ ట్యూస్‌డే రెండూ ఇందులో ఈ ట్రిప్ లోనే కలిసి వస్తాయి. థీమ్ నైట్స్, వర్క్‌షాప్స్, పార్టీలు, సరదా కార్యక్రమాలు అన్నీ ఈ ప్రయాణంలో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రూయిజ్ ప్రయాణంలో అరూబా, బోనైర్, కురాకావో దీవులు (స్నార్కెలింగ్, డైవింగ్‌కి ప్రసిద్ధి), జమైకా అడవులు, గ్రేట్ స్టిరప్ కే అనే ప్రైవేట్ బీచ్ సందర్శన ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కుదరకపోతే జూలై 7- 26 తేదీల్లో మాలాగా నుంచి ఆజోర్స్ వరకు ఇదే తరహా ప్రయాణం ఉండనున్నట్లు చెప్పారు.
షిప్ లో బార్లు, రెస్టారెంట్లు
నార్వేజియన్ క్రూయిజ్ లైన్ నౌకలో మెుత్తం 2,300 మంది వరకూ ప్రయాణించగలరు. వారి కోసం ఈ నౌకలో 16 రెస్టారెంట్లు, 14 బార్లు, రెండు బౌలింగ్ లేన్లు, క్యాసినో, స్పా, విలాసవంతమైన గార్డెన్ విల్లాలు ఉన్నాయి. అమెరికన్, ఫ్రెంచ్, జర్మన్ ఇలా అన్నీ రకాల ఫుడ్ ఇందులో లభిస్తాయి. అంతేకాదు కావాల్సినంత మద్యం కూడా ఇందులో లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
అక్కడ దుస్తులు తప్పనిసరి
అయితే క్రూయిజ్ షిప్ ప్రయాణంలో అన్ని వేళలా బట్టలు లేకుండా ఉండటం సాధ్యపడదని నిర్వహకులు చెబుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో దుస్తులు తప్పనిసరిగా ధరించాల్సిందేనని అన్నారు. డైనింగ్ హాల్స్, కెప్టెన్ స్వాగత వేడుక, సాంస్కృతిక ప్రదర్శనలు, నౌక పోర్ట్ వద్ద ఆగినప్పుడు తప్పనిసరిగా బట్టలు ధరించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అయితే ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన, అనుమతి లేకుండా ఫొటోలు తీసినా చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. అలా ప్రవర్తించిన వారిని వెంటనే షిప్ నుంచి దింపేస్తామని పేర్కొన్నారు.
Also Read: Pradhan Mantri Mudra Yojana: వ్యాపారం చేయాలని ఉందా? ఇలా చేస్తే ఖాతాలోకి రూ.20 లక్షలు!
ఖర్చు ఎంత?
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం ఈ క్రూయిజ్ షిప్ లో ప్రయాణించాలంటే ఒక్కో టికెట్ ధర రూ.43 లక్షల వరకు ఉంటుంది. 11 రోజుల పాటు సూర్యోదయం, సూర్యస్తమయం, సముద్రపు అందాలు, బీచ్ లు చూసేందుకు చాలా మంది ఖర్చుకు వెనకాడటం లేదని వార్తా సంస్థ తెలిపింది. అంతేకాదు ఒకసారి వచ్చిన వారే మళ్లీ మళ్లీ వస్తున్నారని కూడా న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే ఈ బట్టలు అవసరం లేని క్రూయిజ్ షిప్ ప్రయాణానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.