GHMC: వర్షాకాలం కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించేందుకు జీహెచ్ఎంసీ(GHMC) నగరంలో దోమల నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత నెల 29వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ శానిటేషన్ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో ఎక్కడా కూడా చెత్త కుప్పలు లేకుండా, దోమలు వృద్ధి చెందేలా నీరు నిల్వ ఉండకుండా సిబ్బంది చేపట్టిన చర్యలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(RV Karnan) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్క జూలై నెలలోనే 15,500 కు పైగా కాలనీలలో దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు(Anti-larvae operations) చేపట్టారు. అంతేగాక, దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, సంబంధిత కరపత్రాలను ఇంటింటికి వెళ్లి జీహెచ్ఎంసీ పంపిణీ చేస్తుంది. అవగాహన కార్యక్రమాలు మంచి ఫలితాలనిచ్చేందుకు ఈ కార్యక్రమంలో స్వయం సహాయక బృందాలను కూడా భాగస్వాములను చేస్తున్నారు.
నివారణ చర్యలు
యాంటీ లార్వా ఆపరేషన్లలో వేలాది మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 34 లక్షల 45 వేల 357 ఇళ్లను రెండు మూడు సార్లు తనిఖీ చేయగా, లార్వాతో ప్రభావితమైన ఇళ్లు 1.5 శాతం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే, కోటి 10 లక్షల 35 వేల కంటైనర్లను తనిఖీ చేయగా 0.5 శాతం కంటైనర్లు ప్రభావితమైనట్లు నిర్ధారించి, నివారణ చర్యలు చేపట్టారు. ఈ మాసంలో 1700 కు పైగా స్కూళ్లలో మరియు 320 కు పైగా కళాశాలలలో ఐఆర్ఎస్ స్ప్రేపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Hyderabad: దొంగతనం కేసులో బాధితుడినే మోసం చేసిన హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు
కమిషనర్ పర్యవేక్షణ..
అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలో భాగంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో వర్షాకాలంలో వచ్చే డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఈ ప్రత్యేక కార్యక్రమాలను కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందికి ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. బల్దియా క్రమం తప్పకుండా చేపడుతున్న చర్యలు క్షేత్ర స్థాయిలో సత్ఫలితాలిస్తున్నందున, గతంలో కన్నా ఈ సారి కీటక జనిత వ్యాధులు తక్కువగా నమోదు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు.