Hyderabad: హైదరాబాద్ ఈస్ట్‌జోన్ పోలీసుల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇటీవల మెట్టుగూడలోని ఓ వివాదాస్పద స్థలం విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈస్ట్ జోన్ పోలీసులు, తాజాగా మరో షాకింగ్ ఉదంతంతో వార్తల్లో నిలిచారు. ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసిన వ్యక్తికి న్యాయం చేయాల్సిన పోలీసులు, బాధితుడినే దారుణంగా మోసం చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చిలకలగూడ ఏసీపీ సబ్-డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఒక వ్యక్తి ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగింది. ఇంట్లో దాచిపెట్టిన 6 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. బాధితుడు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో పని చేస్తున్న మహిళ ఈ దొంగతనం చేసిందని పేర్కొంటూ, సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పోలీసులకు అందించాడు. ఒక ఏజెన్సీ ద్వారా ఆ మహిళను పనిలో పెట్టుకున్నానని, ఆ ఏజెన్సీ వివరాలను కూడా బాధితుడు పోలీసులకు అందించాడు.
అయితే, కేసు విచారణ మొదలు కాకముందే స్టేషన్ సీఐ బదిలీ అయ్యారు. పక్కనే ఉన్న మరో స్టేషన్ సీఐ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. సదరు డీఐ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మహిళను పనిలో కుదిర్చిన ఏజెన్సీ నిర్వాహకులను పిలిపించారు. ఆ మహిళ విశాఖపట్నం వాస్తవ్యురాలిగా తెలియడంతో ఫోన్ చేసి ఆమెను రప్పించారు. మొదట తనకు ఏ పాపమూ తెలియదని బుకాయించిన ఆ మహిళ, సీసీ కెమెరాల ఫుటేజీని చూపించడంతో చేసిన నేరాన్ని అంగీకరించింది. చోరీ చేసిన బంగారాన్ని విజయవాడలో ఉంటున్న తన సోదరి వద్ద పెట్టినట్టు చెప్పింది. ఆ తరువాత కొద్దిసేపటికే స్టేషన్‌లో బాత్రూంలోకి వెళ్లిన మహిళ అక్కడ ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించిన అనంతరం కోలుకున్నాక ఆమెను స్టేషన్ పిలిపించారు. ఆ తర్వాతే అసలు భాగోతం మొదలైంది.
ఫిర్యాదీకి ‘క్షవరం’..
పోలీసులు ఫిర్యాదీని పిలిపించి, “మీ ఇంటి నుంచి చోరీ అయిన బంగారం విజయవాడలో ఉంది. అక్కడికి మా వాహనంలో వెళ్లలేం. మీ కారు ఇస్తే వెళ్లి నగలు స్వాధీనం చేసుకుని వస్తాం” అని చెప్పారు. దీంతో బాధితుడు కొత్తగా కొన్న తన కారును వారికి ఇచ్చాడు. అంతేకాకుండా, దారి ఖర్చులకంటూ రూ. 50 వేల నగదును కూడా తీసుకున్నారు. పోలీసులు విజయవాడకు వెళ్లి, నగలు తస్కరించిన మహిళ సోదరిని విచారణ చేయగా, అప్పటికే వాటిని మార్వాడీ వద్ద కుదువపెట్టి లక్ష రూపాయలు తీసుకున్నట్టు ఆమె చెప్పింది. నగలు కుదువపెట్టిన షాపును చూపించింది. ఇదే అదనుగా భావించిన పోలీసులు, సదరు మార్వాడీని “చోరీ చేసిన బంగారం కుదువపెట్టుకున్నందుకు నీపై కూడా కేసులు పెడతాం” అని బెదిరించి, అతని నుంచి రూ. 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చి, దుమ్ముకొట్టుకుపోయిన కారును ఫిర్యాదీకి తిరిగి ఇచ్చారు. అయితే, చోరీ అయిన 6 తులాల బంగారు నగల్లో 4 తులాల ఆభరణాలు మాత్రమే రికవరీ అయ్యాయని చెప్పారు.
Also Read: Gold Rates (01-08-2025): బంగారం కొనాలంటే కోనేయండి ఇప్పుడే.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..
స్టేషన్ వర్గాల నుంచే..
జరిగిన ఈ వ్యవహారమంతా పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న మరికొందరు సిబ్బంది ద్వారా బయటికి పొక్కింది. విషయం మీడియా దృష్టికి కూడా వచ్చింది. ఇది తెలిసిన కేసు విచారణ జరిపిన పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. ఆ వెంటనే ఫిర్యాదీ ఇంటికి వెళ్లి అతనికి అప్పగించిన 4 తులాల బంగారు నగలను వాపసు తీసుకున్నారు. కోర్టు నుంచి వీటిని వాపసు తీసుకోవాలని సూచించారు. బంగారం పోగొట్టుకోవడమే కాకుండా, అదనంగా రూ. 50 వేలు చెల్లించినా, బంగారు నగలు చేతికి రాకపోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నట్లు సమాచారం.
కొసమెరుపు..
ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే, చోరీ చేసిన మహిళను పనిలో పెట్టిన ఏజెన్సీ నిర్వాహకుల నుంచి కూడా పోలీసులు భారీగా డబ్బు దండుకున్నట్టుగా తెలుస్తుంది. సదరు మహిళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా పనిలో పెట్టినందుకు మీ ఏజెన్సీపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు భయపెట్టడంతో, సదరు ఏజెన్సీ నిర్వాహకుడు అడిగినంత సమర్పించుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పటికే సదరు పోలీస్ స్టేషన్ ఉన్న ఏసీపీ సబ్-డివిజన్ పరిధిలోని మిగతా స్టేషన్లలో చర్చనీయంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.