Harish Rao on Lokesh: బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహిస్తుండటంతో ఏపీ చంద్రబాబు (CM Chandrababu) ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని ఆరోపించారు. ఢిల్లీలో పవర్ ఉంది కాబట్టి బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతామని లోకేష్ అంటున్నారని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మాట్లడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నల వర్షం
ఏపీ మంత్రి లోకేష్ బనకచర్ల (Banakacherla Project) కట్టితీరుతామని అంటుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కడుతలేరని చెబుతున్నారని హరీశ్ రావు అన్నారు. ‘గోదావరిలో మిగులు జలాలు నిజంగా ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు మీ డీపీఆర్ ను వెనక్కి తిప్పి పంపింది. పోలవరం అథారిటీ, గోదావరి బోర్డు, సిడబ్లుసి, ఎన్విరాన్ మెంట్ సంస్థలు ఎందుకు బనకచర్ల డిపిఆర్ ను తిరస్కరించాయి. నాలుగు కేంద్ర సంస్థలు బనకచర్లను తిప్పి పంపింది నిజం కాదా? మిగులు జలాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటాయించారో చెప్పు?’ అంటూ నిలదీశారు.
‘భవిష్యత్తు పాడుచేసుకోవద్దు’
సాగునీటి అంశాలపై అవహగాహన లేకుండా లోకేశ్ (Nara Lokesh) మాట్లాడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. యంగ్ స్టార్ గా ఉన్న లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడుతూ భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. అంతరాష్ట్ర వ్యవహారాల్లో మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలని లోకేశ్ కు సూచించారు. ఆనాడు రాష్ర్ట కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. పోతిరెడ్డికి పొక్క పెట్టి నీళ్లు తీసుకుపోయారని.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లు నీళ్లు తీసుకుపోతా అంటే చూస్తూ ఊరుకుంటామా? అని ప్రశ్నించారు.
Also Read: Uttarakhand Tragedy: దేశంలో ఘోరం.. బాలుడ్ని పొట్టనపెట్టుకున్న 5 ఆస్పత్రులు.. రంగంలోకి సీఎం!
‘మీ నాన్నను అడుగు’
కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని లోకేశ్ అంటున్నారని.. ఇదే విషయం గురించి మీ నాన్న (సీఎం చంద్రబాబు)ని అడగాలని హరీశ్ అన్నారు. ఒక్క కాళేశ్వరం వ్యతిరేకిస్తూ మీ నాన్న ఏడు ఉత్తరాలు రాశారని.. మీరేమో వ్యతిరేకించలేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని లోకేశ్ పై మండిపడ్డారు. కాళేశ్వరం అనేది కొత్త ప్రాజెక్టు కాదని, ప్రాణహితలో అంతర్భాగమని హరీశ్ రావు స్పష్టం చేశారు. అందుకే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వర్తించదని కేంద్రం స్పష్టంగా పేర్కొందని చెప్పారు. ‘ఆనాడు ఉమ్మడి ఏపీలో అనేక కుట్రలు జరిగాయి. ఇప్పుడు బనకచర్ల కట్టి తీరుతాం అంటున్నారు. మేము అడ్డుకొని తీరుతాము’ అంటూ హరీశ్ రావు స్పష్టం చేశారు.