Vartex Developers
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Vertex: మంఖాల్‌లో రెచ్చిపోతున్న రియల్‌ మాఫియా

  • చెరువు శిఖం, అసైన్డ్, ఎయిర్‌ పోర్ట్ భూముల్లో దర్జాగా వెంచర్లు
  • హెచ్‌ఎండీఏ, రెరా గుడ్డిగా అనుమతుల జారీ
  • 350 ఎకరాల్లో ‘వర్టెక్స్​​‍ డెవలపర్స్​‍’ అరాచకం
  • ఫిర్యాదులు చేసినా.. కేసులు నమోదైనా డోంట్‌ కేర్‌
  • అక్రమాలకు అన్ని శాఖల అధికారుల అండదండలు!
  • ఈ కబ్జాలను ఆపేదెవరు? చర్యలు తీసుకునేదెవరు?
  • ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఎడిటర్


Vertex: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మంఖాల్‌లో రియల్‌ మాఫియా చెలరేగిపోతున్నది. వర్టెక్స్​​‍ డెవలపర్స్​‍ పేరుతో సుమారు 350 ఎకరాల్లో వెంచర్లు చేస్తుండగా చెరువు శిఖం, అసైన్డ్, ఎయిర్‌ పోర్ట్ అథారిటీ భూములను సైతం కలిపేసుకుని దర్జాగా దందాను కొనసాగిస్తున్నారు. హెచ్‌ఎండీఏ, రెరా సైతం గుడ్డిగా అనుమతులను ఇవ్వడం విస్మయం గొలుపుతున్నది. రియల్‌ మాఫియా భూ దాహంపై ఫిర్యాదులు చేసినా పట్టనట్లుగా అన్ని శాఖలు వ్యవహరిస్తున్నాయి. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా సైతం కళ్లెదుట జరుగుతున్న అక్రమ దందాపై చర్యలకు సాహసించలేకపోతున్నది. బాధితుల ఫిర్యాదు మేరకు వర్టెక్స్​​‍ డెవలపర్స్​‍ ప్రతినిధి వర్మపై పోలీస్ కేసులు సైతం నమోదు అయ్యాయి. అయినా డోంట్‌ కేర్‌ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ పెద్దల అండదండలపై అనుమానాలు వ్యక్తమమవుతున్నాయి.

ఇదీ.. అక్రమ వెంచర్ల కథ


శ్రీశైలం – హైదరాబాద్‌కు అర కిలోమీటరు దూరంలో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు ఆనుకుని విలువైన భూములున్నాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫోర్త్ సిటీకి సైతం చేరువలోనే ఉన్నాయి. ఇంకేం, అక్కడి భూములపై వర్టెక్స్​​‍ డెవలపర్స్​‍ కన్ను పడింది. పట్టా భూములను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను కలిపేసుకుని ఇతరత్రా భూములను సైతం కొల్లగొట్టేందుకు ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా వర్టెక్స్​​‍ డిస్ట్రిక్ట్, వర్టెక్స్​​‍ ఫ్లోరేంజా, వర్టెక్స్​​‍ గిగా సిటీ పేరుతో 7 మెగా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నది. సర్వే నెంబర్ 82/పీ, 83/పీ, 84/పీ, 85/పీ, 86/పీ, 90, 92, 93, 94, 95, 773, 778, 779/పీ, 774/పీ, 777/పీ లలో 4,17,893.06 చదరపు మీటర్లలో ఓ వెంచర్‌ను చేస్తున్నారు. మరో వెంచరును సర్వే నెంబరు 73(పీ), 85(పీ), 86(పీ)లలో 42,762.54 చదరపు మీటర్లలో, వేరొక వెంచర్‌ను 64/పీ, 71/పీ, 72/పీ, 73/పీ లలో 55,200.82 చదరపు మీటర్లలో చేస్తున్నారు. ఇంకొక వెంచర్‌ను 774/పీ, 777పీ లలో 30,167.97 చదరపు మీటర్లలో చేస్తుండగా, సర్వే నెంబర్ 86/పీ, 90/పీ, 92/పీ లలోని 70,639.46 చదరపు మీటర్లలో వేరే వెంచర్‌ ఏర్పాటవుతున్నది. సర్వే నెంబర్ 72/పీ, 73/పీ లలో 44,596.41 చదరపు మీటర్లలో ఒక వెంచర్‌ను, సర్వే నంబరు 83, 84, 85, 86లలో 1,57,551.11 చదరపు మీటర్లలలో వేరే వెంచర్‌ను చేస్తున్నారు. మొత్తం 7 వెంచర్లను 8,18,811.37 చదరపు మీటర్లలో ఏర్పాటు చేసేలా 2021 – 2022 మధ్య కాలంలోనే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి అమలు చేశారు. పార్కులతో పాటు 100 ఫీట్ల నుంచి 150 ఫీట్ల వెడల్పుతో విశాలమైన రోడ్లను వేశారు. వెంచర్లలో 355 నుంచి 468 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొత్తం 687 విల్లాలను నిర్మించి రూ.7 కోట్ల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇందులో వంద ఎకరాల వరకు చెరువు శిఖం, అసైన్డ్, శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు అథారిటీకి చెందిన భూములను ఆక్రమించుకుని మొత్తం 350 ఎకరాల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటికి గుడ్డిగా హెచ్‌ఎండీఏ అనుమతులు జారీ చేయగా అన్ని సక్రమమేనంటూ రెరా సైతం పచ్చ జెండా ఊపింది.

అసైన్డ్ భూములను కలిపేసుకుని..

భూమిలేని నిరుపేద దళిత రైతులకు 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మంఖాల్‌లోని సర్వే నెంబర్ 68, 70, 71, 73, 85, 86 లలోని సుమారు 25.03 ఎకరాల భూమిని అసైన్‌ చేసి పంపిణీ చేసింది. వర్టెక్స్​​‍ డెవలపర్స్​‍ చేస్తున్న 7 వెంచర్ల పరిధిలోనే ఈ అసైన్డ్ భూములు ఉన్నాయి. వాటిని విక్రయించుకునే వెసులుబాటు లేకపోవడంతో ఆయా రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వర్టెక్స్​​‍ కంపెనీ కొందరు రైతులతో అనధికారిక ఒప్పందం చేసుకున్నది. అగ్గువకే అసైన్డ్ భూములను కొట్టేసిన వర్టెక్స్​​‍ కంపెనీ యాజమాన్యం ఎకరాకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రైతులకు కొంత నగదు రూపంలో మరికొంత చెక్కుల రూపంలోనూ చెల్లింపులు జరిపింది. రికార్డులు మారిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తామని, అభివృద్ది చేసిన వెంచర్‌ లో ప్లాట్లు కూడా ఇస్తామని నోటరీపై అనధికార ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. పై సర్వే నెంబర్లలో పట్టా భూములు, అసైన్డ్ భూములు ఉండడంతో పట్టా భూములను కొనుగోలు చేసిన వర్టెక్స్​​‍ యాజమాన్యం తెలివిగా అసైన్డ్ భూములను కలిపేసుకుని వెంచర్లను చేసింది.

గొలుసుకట్టు చెరువులకు ‘ఉరి’

వర్టెక్స్​​‍ కంపెనీ గొలుసుకట్టు చెరువుల గొంతు సైతం నులిమింది. సూరం(సూర్యారావు) చెరువు, కొత్త కుంటలకు సంబంధించిన ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ భూముల్లో మట్టిని కొట్టి వెంచర్‌లో కలిపేసుకున్నది. సూరం చెరువు సర్వే నెంబర్ 139, 140లలో 60.33 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి చేరువలోనే కొత్త కుంట, సర్వే నెంబర్ 776లో ఉన్నది. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 10 ఎకరాల్లో ఉంటుందని స్థానిక రైతులు పేర్కొంటుండగా, నీటి పారుదల శాఖ అధికారులు మాత్రం 8 ఎకరాల్లో ఉంటుందని చెబుతున్నారు. అయితే, సూరం చెరువు, కొత్త కుంటలకు సంబంధించిన ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో భారీ ఎత్తున మట్టితో పూడ్చి వేశారు. ఈ చెరువులకు సంబంధించిన వరద కాలువపై 150 ఫీట్ల రోడ్డును ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మించారు. ఎగువ నుంచి వచ్చే వరద నీరు కొత్త కుంటలోకి చేరకుండా కాంక్రీట్‌తో డ్రెయిన్‌ బాక్స్​​‍లు నిర్మించారు. అలాగే, కుంట నుంచి వరద నీరు దిగువన ఉన్న సూరం చెరువుకు వెళ్లే మార్గంలోనూ డ్రెయిన్‌ బాక్సులను నిర్మించారు. ఈ రెండు నీటి వనరుల నుంచి వరద నీరు గొలుసుకట్టు చెరువుల ద్వారా ప్రవహించి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి చేరుతాయని స్థానికులు చెబుతున్నారు. ఇంతటి ప్రాధ్యానత ఉన్న చెరువులకు సంబంధించిన వరద నీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేసినప్పటికీ వర్టెక్స్​​‍ కంపెనీపై చర్యలకు ఎవరూ పూనుకోకపోవడం లేదు.

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ స్థలం సైతం..

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం మంఖాల్‌లోని సర్వే నెంబర్ 96, 97, 98, 99, 100, 101, 102, 768, 769, 770, 771, 772, 780లలో 349.20 ఎకరాలను 2002 నుంచి 2004 మధ్యకాలంలో సేకరించింది. ఇందులో రైతులకు సంబంధించిన పట్టా భూములు ఉండగా వాటికి పరిహారం చెల్లించి ఆయా భూములను ఎయిర్‌ పోర్ట్ అథారిటీ తన ఆధీనంలో ఉంచుకున్నది. అయితే, ఎయిర్‌ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూమి పోగా, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా వదిలేసిన సుమారు 20 నుంచి 30 ఎకరాల భూమిని వర్టెక్స్​​‍ కంపెనీ తమ వెంచర్లలో కలిపేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎయిర్‌ పోర్ట్ ప్రహరీకి ఆనుకునే వెంచర్‌ ఉండగా, అందులో 150 ఫీట్ల వెడల్పులో భారీ రోడ్డును నిర్మించారు. అయితే, గతంలో ఉన్న రోడ్లనే అభివృద్ది చేశామని వెంచర్‌ నిర్వాహకులు చెబుతుండగా అసలు ఇక్కడ రోడ్లే లేవని ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన స్థానిక ప్రజానీకం పేర్కొంటున్నది. ఎయిర్‌ పోర్ట్‌ను ఆనుకునే చేసిన వెంచర్‌కు హెచ్‌ఎండీఏ అనుమతులు జారీ చేయడం విస్తుగొలుపుతున్నది.

Read Also- Viral News: తాగకుండానే బస్ డ్రైవర్‌కు ఆల్కాహాల్ పాజిటివ్.. ఎంక్వైరీ చేస్తే!

అంతా ‘హైడ్రా’మా..

  • వర్టెక్స్​​‍ డెవలపర్స్​‍ చేసిన వెంచర్‌కు వెళ్లేందుకు శ్రీశైలం – హైదరాబాద్‌ ప్రధాన రహదారి నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర 150 ఫీట్ల రోడ్డును వేశారు. ఈ రోడ్డులోనే తమకు సంబంధించిన 2.30 ఎకరాల పట్టా భూమి ఉందంటూ ఎన్‌ఆర్‌ఐలు చైతన్య, నరేందర్‌ రెడ్డి దంపతులు చెబుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రైవేట్ వ్యక్తులతో, పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నది. తమకు న్యాయం చేయాలంటూ ఏడాది కాలంగా పోరాడుతున్న ఎన్‌ఆర్‌ఐ దంపతులు చివరకు గత జూన్‌ 19న హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వారికి న్యాయం చేస్తానని కమిషనర్‌ రంగనాథ్‌ హామీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆయన సైలెంట్‌ అయ్యారు. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
  • సూరం చెరువు ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో గత కొంతకాలం క్రితం హైడ్రా కమిషనర్‌ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఆ తర్వాత చెరువుకు సంబంధించిన స్థలంలో ఏర్పాటు చేసిన ఫ్రీ కాస్ట్ వాల్‌ను సిబ్బంది కూల్చి వేశారు. సూరం చెరువు, కొత్త కుంటల ఆక్రమణలపై, వర్టెక్స్​​‍ డెవలపర్స్​‍ భూ దందాలపై తుక్కుగూడ ప్రాథమిక మత్య్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కుక్కల కృష్ణ ఎంతోకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక తహసిల్దార్‌, ఆర్డీవో, మున్సిపల్‌ మొదలుకుని జిల్లా కలెక్టర్‌, హెచ్‌ఎండీఏ, సీసీఎల్‌ఏ తదితర అన్ని శాఖలకు ఫిర్యాదు చేశారు. చివరకు హైడ్రాకు సైతం ఫిర్యాదు చేశారు. 11 మందిని ప్రతివాదులుగా చేర్చి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ కూడా వేశారు. మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టు గత మార్చి 5న ఆదేశాలు ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు చర్యలేమీ లేకపోవడంతో కృష్ణ కంటెంప్ట్ దాఖలు చేశారు.
  • సర్వే నెంబర్ 122, 135, 136లలో నిర్మించిన 150 ఫీట్ల రోడ్డుకు సంబంధించిన అనుమతులపై మహ్మద్‌ రషీద్‌, కుక్కల కృష్ణ వేర్వేరుగా 2023 జూలై 12న హెచ్‌ఎండీఏకు, 2023 జూలై 7న తుక్కుగూడ మున్సిపాలిటీకి ఆర్టీఐ దరఖాస్తు చేశారు. ఆయా సర్వే నెంబర్లలో రోడ్డుకు సంబంధించి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని హెచ్‌ఎండీఏ, తుక్కుగూడ మున్సిపాలిటీలు ఆర్టీఏ దరఖాస్తుకు సమాధానం ఇచ్చాయి. అయినా వర్టెక్స్​​‍ డెవలపర్స్​‍పై చర్యలు మాత్రం నేటికీ లేవు.
  • కొత్త కుంటకు సంబంధించిన సర్వే నెంబర్ 776లో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌‌కు సంబంధించిన ప్రాంతంలో సీసీ డ్రైన్‌ నిర్మాణం చేపట్టడంపై ఇరిగేషన్‌ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్ గోవిందు 2024 జూన్‌ 19న పహాడీ షరీఫ్‌ పోలీస్ స్టేషన్‌లో వర్టెక్స్​​‍ యజమాని వర్మపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వర్మపై ఎఫ్‌ఐఆర్‌ సైతం అయింది. ఆ తర్వాత కేసు అడుగు ముందుకు పడలేదు. పట్టా భూమిని ఆక్రమించుకోవడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఎన్‌ఆర్‌ఐ దంపతులు చైతన్య రెడ్డి, నరేందర్‌ రెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మతోపాటు మరికొందరు ప్రైవేట్ వ్యక్తులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ చేసినట్లు తెలిసింది. దీనిపైనా చర్యలు తీసుకున్నది శూన్యం.

Read Also- Home Decor Essentials: మీ ఇంటిని స్వర్గంలా మార్చే 5 బ్యూటిఫుల్ టిప్స్.. ఓసారి ట్రై చేయండి!

Just In

01

Pawan Kalyan: అసలిప్పటి వరకు ‘ఓజీ’ స్టోరీ ఏంటో నాకు తెలీదు

Mirai Movie Collections: 150 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘మిరాయ్’ .. తేజ సజ్జా సరికొత్త రికార్డ్!

Vilaya Thandavam: ‘విలయ తాండవం’ టైటిల్ పోస్టర్ అదిరింది

Avika Gor: ప్రియుడితో ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏడడుగులు.. ఫొటోలు వైరల్

Disqualification Hearing: నలుగురు ఎమ్మెల్యేల సుదీర్ఘ విచారణ.. నెక్స్ట్ ఏంటి?