Viral News: అదేంటో కానీ మద్యం సేవించే వ్యక్తుల్లో కొందరు తాగావంటే అస్సలు ఒప్పుకోరు. మాట్లాడే సోయి కూడా లేకపోయినా.. ‘నేను తాగలేదు. కావాలంటే చెక్ చేసుకో’ అంటూ బుకాయిస్తుంటారు. కానీ, ఇందుకు పూర్తి రివర్స్‌లో ఓ వ్యక్తి అస్సలు తాగలేదు బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటున్నా.. బ్రీత్‌అనలైజర్ టెస్టు మాత్రం పాజిటివ్‌గా చూపించింది. ఈ విచిత్ర ఘటన కేరళలో వెలుగు చూసింది. అన్ని రకాల మద్యాలకు దూరంగా ఉంటున్న ఓ బస్సు డ్రైవర్‌కు బ్రీత్‌అనలైజర్ పరీక్షలో నెగటివ్ రావడానికి బదులు.. పాజిటివ్ వచ్చింది. తాను మద్యం తాగలేదని సదరు వ్యక్తి చెబుతున్నా, టెస్టులో మాత్రం ఆల్కహాల్ సేవించినట్టుగా రీడింగ్ చూపిస్తుండడంతో (Viral News) అధికారులు అవాక్కయ్యారు.
అసలు విషయం ఏంటంటే?
మద్యం తాగకుండానే బ్రీత్ అనలైజర్ టెస్టులో పాజిటివ్ రావడంపై షాక్‌కు గురైన అధికారులు డ్రైవర్ తిన్న ఆహారం, తాగిన పానీయాలపై ఆరా తీశారు. తాను పనస పండు తిన్నానని డ్రైవర్ చెప్పాడు. దీంతో, పనస పండు తినడం కారణంగానే బ్రీత్‌అనలైజర్ టెస్టు ఫలితం ఆ విధంగా వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన పఠనంతిట్టలోని కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) డిపోలో చోటుచేసుకుంది. డ్రైవర్ డ్యూటీ ఎక్కడానికి కొద్దిసేపటి ముందు పనస పండు తిన్నాడు. ఓ ఉద్యోగి ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆ పండును అక్కడున్న సహోద్యోగులు అందరూ పంచుకొని తిన్నారు. టెస్టులో పాజిటివ్ వచ్చిన డ్రైవర్ అందరి కంటే కాస్త ఎక్కువగానే పనస తొనలు తిన్నాడని ఒక అధికారి వెల్లడించారు. బ్రీత్ టెస్ట్‌లో అతడు గాలి ఊదితే, రీడింగ్ సున్నా నుంచి 10కి వేగంగా పెరిగిందని, దీంతో అతడు షాక్‌కు గురయ్యాడని తెలిపారు. అయితే, తాను తాగలేదని సదరు డ్రైవర్ ధైర్యంగా చెప్పాడని, రక్త పరీక్ష చేయించుకోడానికి కూడా ముందుకొచ్చాడని ఓ అధికారి చెప్పారు. పనస పండు తిన్న మరో ముగ్గురికి టెస్ట్ చేయగా వారు కూడా మద్యం సేవించినట్టుగా రీడింగ్ చూపించిందని వివరించారు.
Read Also- Rahul Gandhi: రాజకీయ జీవితంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ప్రాక్టికల్‌గా పరిశీలించిన అధికారులు
పనస పండు తింటే నిజంగానే మద్యం సేవించినట్టుగా వస్తుందా? అనే సందేహానికి సమాధానాన్ని అధికారులు ప్రాక్టికల్‌గా తెలుసుకున్నారు. పరగడుపున బ్రీత్‌అనలైజర్ టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చింది. పనస పండు తిన్న తర్వాత మళ్లీ పరీక్ష చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో, జాక్‌ఫ్రూట్ తింటే బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఫలితం సరిగా రాదని అధికారులు గుర్తించారు. అక్కడి ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. పనసపండు తింటే తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.
బ్రీత్‌అనలైజర్ ఎలా పనిచేస్తుంది?
బ్రీత్‌అనలైజర్ పరికరంలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అనోడ్ (నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్), రెండోది కాథోడ్ (పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్). టెస్టింగ్ సమయంలో వ్యక్తులు నోటితో ఊదే గాలిలో ఇథనాల్ (మద్యం) ఉంటే, పరికరంలో అనోడ్ వద్ద నీటితో కలసి ఎసిటిక్ యాసిడ్‌గా మారుతుంది. అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక, గాలిలోని ఆక్సిజన్ కాథోడ్ వద్దకు చేరి నీరుగా మారిపోతుంది. ఈ రెండు చర్యల ఫలితంగా రెండు ఎలక్ట్రోడ్‌ల మధ్య స్వల్పస్థాయి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ కరెంట్ తీవ్రత స్థాయిని బట్టి, శ్వాసలో ఉన్న ఇథనాల్ పరిమాణాన్ని అంచనా వేస్తారు. రక్తంలోని మద్యం స్థాయిని గుర్తించడానికి ఈ పరికరం ఉపయోగపడదు. శ్వాసలో ఉండే మద్యం ఆధారంగా మాత్రమే అంచనా వేస్తుంది.
Read Also- Rupee Fall: ఆగని రూపాయి పతనం.. శుక్రవారం ఏకంగా..
తప్పుడు ఫలితాలు ఎలా?
కొందరిలో, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు, ఉపవాసాలు చేసేవారి శ్వాసలో ఎసిటోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఇథనాల్‌కు దగ్గరగా ఉండే రసాయనమే. కాబట్టి, కొన్నిసార్లు పొరపాటున మద్యం మాదిరిగానే తప్పుడు ఫలితాలు చూపించే అవకాశం ఉంటుంది. ఇక పనస పండులో ఎక్కువగా పండిపోయినప్పుడు దానిలోని చక్కెరలు సహజంగా రసాయన మార్పులు జరుగుతాయి. ఫర్మెంటేషన్ ప్రక్రియ జరిగిచ స్వల్ప స్థాయి మద్యంగా (ఇథనాల్) మారుతుంది. ఇక, కేరళలో జరిగిన ఘటనలో డ్రైవర్ బాగా పండిన పనస పండు తిన్నాడు. దానిలో అప్పటికే ఏర్పడిన స్వల్ప ఇథనాల్, అతడి శ్వాసలోంచి బ్రీత్ అనలైజర్‌లోకి వెళ్లడంతో మద్యం తాగినట్టు తేలింది.