Diets – Supplements: మానవ శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో ప్రొటీన్ ఒకటి. రోగ నిరోధక శక్తి పెరుగుదలతో పాటు కండరాల నిర్వహణ, బలోపేతానికి ఇది చాలా అవసరం. అయితే చాలా మందిలో ప్రోటిన్ లోపం ఒక సాధారణ సమస్యగా మారిపోయిందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రోజూవారీ ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నట్లు పేర్కొంటున్నారు. భారత వైద్య పరిశోధనామండలి (ICMR) సిఫారసు ప్రకారం ఒక వ్యక్తి తన శరీర బరువు ప్రతీ కిలోకు 0.8 నుండి 1 గ్రాము ప్రోటీన్ అవసరం. అయితే ప్రస్తుత రోజుల్లో రెండు విధాలుగా ప్రోటీన్లు అందుబాటులో ఉన్నాయి. సహజసిద్ధమైన ఆహారంతో పాటు సప్లిమెంటరీ (పౌడర్, మెడిసన్స్) రూపాల్లో లభిస్తున్నాయి. అయితే వీటిలో ఏ రూపంలో ప్రొటీన్స్ తీసుకుంటే మంచిది? నిపుణులు ఏమంటున్నారు? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఆహారం ద్వారా ప్రోటీన్..
భారతీయులు తమ ప్రోటీన్ అవసరాలను సప్లిమెంట్ల కంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా సమకూర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. భారతీయ ఆహారంలో అనేక సహజ ప్రోటీన్ వనరులు అందుబాటులో ఉన్నాయని.. అవి చాలా సులభంగా లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. చనా, రాజ్మా, మూంగ్ దాల్, మసూల్ దాల్ వంటి పప్పు ధాన్యాలలో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుందని తెలియజేస్తున్నారు. అలాగే పాలు, పెరుగు, పన్నీరు, జున్నులో కూడా ప్రోటీన్ సమర్థవంతంగా అందిస్తాయని స్పష్టం చేస్తున్నారు. మాంసాహారమైన గుడ్లు, చికెన్, చేపల్లోనూ గణనీయంగా ప్రోటీన్లు లభిస్తాయి. వీటితో పాటు సోయా ఉత్పత్తులు.. జొన్నలు, రాగులు, బాదం, వేరుశనగ వంటి చిరు ధాన్యాలను నిత్యం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ ను సమకూర్చుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.
Also Read: Maha Lakshmi Scheme: మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ
సప్లిమెంట్లు అవసరమా?
సాధారణ పౌరులు.. ప్రోటీన్స్ కోసం సప్లిమెంట్లను తప్పనిసరిగా వాడాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పైన పేర్కొన్న ఆహార పదార్థాలను రోజువారి ఫుడ్ లో భాగం చేసుకుంటే చాలని పేర్కొంటున్నారు. అయితే అథ్లెట్లు, బాడీ బిల్డర్లు, పెద్ద మెుత్తంలో ప్రోటీన్ శరీరానికి అవసరమున్న వారు మాత్రమే సప్లిమెంట్లు వాడితే సరిపోతుందని చెబుతున్నారు. కానీ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు మాత్రం సప్లిమెంట్లు వాడటం అంత మంచిదికాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాగా ఎక్కువ శారీరక శ్రమ చేసే అథ్లెట్లు, ఫిట్ నెట్ ఔత్సాహికులకు కిలోకు 1.2-2 గ్రాముల ప్రోటీన్ అవసరముంటుందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి వారికి సప్లిమెంట్ల ప్రోటీన్ సౌఖర్యవంతంగా ఉంటుందని అంటున్నారు. పోషకాహార లోపంతో బాధపడేవారు కూడా వాటిని తీసుకోవచ్చని చెబుతున్నారు. అయితే అపరిమితంగా, అవసరం లేకపోయిన సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడే ప్రమాదముందని సూచిస్తున్నారు.
Also Read This: Drishyam Style Murder: భర్తను ‘దృశ్యం’ స్టైల్లో లేపేసిన భార్య.. పోలీసులకే ఫ్యూజులు ఎగిరాయ్!
నిపుణుల సలహా
ప్రోటీన్ ను ఏ పద్ధతిలో తీసుకోవాలన్న దానిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఒకే రకమైన ప్రోటీన్ వనరుపై ఆధారపడకుండా వివిధ ఆహారాలను (పప్పులు, పాల ఉత్పత్తులు, గింజలు) కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక రోజులో అవసరమైన ప్రోటీన్ ను.. 3 లేదా 4 విడతలుగా తీసుకునే ఆహారంలో భాగం చేయాలని సూచిస్తున్నారు. ఒకేసారి ప్రోటీన్ తీసుకోవడం కంటే ఇలా విడతలు వారీగా తీసుకోవడం శరీరానికి మంచిదని చెబుతున్నారు. ప్రోటీన్ వనరులను శరీరం చాలా సులభంగా గ్రహించేందుకు వీలవుతుందని చెబుతున్నారు.
గమనిక: ఈ సమాచారం సాధారణ సలహా కోసం మాత్రమే. నిర్దిష్ట ఆహార ప్రణాళిక కోసం డైటీషియన్ లేదా వైద్య నిపుణుడిని సంప్రదించండి.